అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Delimitation | కేంద్ర ప్రభుత్వం (Central govt) జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) చేపట్టడానికి కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై పలు రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా దీనిపై విమర్శలు చేస్తోంది. దీనికి గల కారణాలు తెలుసుకుందాం.
Delimitation | జనాభా ఆధారంగా..
దేశంలో జనాభా ఆధారంగా లోక్‌సభ స్థానాలను ఏర్పాటు చేయడానికి డీలిమిటేషన్ కమిషన్‌ను 1951లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ నివేదిక ఆధారంగా కొత్త ఎంపీ (Parliemnt constuinstency) స్థానాల ఏర్పాటు, ఉన్నవాటి హద్దుల మార్పు చేస్తారు. అయితే 1963లో, 1973లో రెండు సార్లు ఈ కమిషన్ నివేదిక ఆధారంగా ఎంపీ స్థానాలను పెంచారు. 1973లో ఎంపీ స్థానాలను 522 నుంచి 543 కి పెంచారు. ఇప్పటికీ అవే స్థానాలు ఉన్నాయి.
Delimitation | హద్దులు మార్చినా..
దేశంలో 1971 జనాభా లెక్కల ఆధారంగానే ప్రస్తుత లోక్‌సభ(Lok sabha) స్థానాలు ఉన్నాయి. 1973 తర్వాత నియోజకవర్గాల పునర్విభజన చేయలేదు. 2026 వరకు ఎంపీ స్థానాల సంఖ్య పెంచకుండా రాజ్యాంగంలో (Constitution) సవరణ చేశారు. మధ్యలో 2002, 2009లో పార్లమెంట్ స్థానాల హద్దులు, రిజర్వేషన్లు మార్చినా.. సంఖ్య మాత్రం అంతే ఉంది. ప్రస్తుతం 2026లో డీలిమిటేషన్ చేయాలని కేంద్రం యోచిస్తోంది.
Delimitation | జనాభా నియంత్రణకు చర్యలు
దేశంలో 1971 తర్వాత జనాభా(population) నియంత్రణపై ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. చిన్న కుటుంబం.. చింతలేని కుటుంబం అంటూ ప్రజల్లో అవగాహన కల్పించాయి. అయితే జనాభా నియంత్రణను దక్షిణాది రాష్ట్రాలు పక్కాగా అమలు చేశాయి. దీంతో దక్షిణ భారతంలో జనాభా పెరుగుదల తక్కువగా ఉండగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది.
Delimitation | భయం ఎందుకంటే..
కేంద్రంలో చక్రం తిప్పాలంటే ఎంపీ స్థానాలు ఎక్కువగా ఉండాలి. ఏ రాష్ట్రంలో అయితే ఎక్కువ ఎంపీలు ఉంటారో వారు తమ రాష్ట్రానికి నిధులు, ఇతర పనులు చేసుకోవడం సులువు అవుతుంది. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం డీలిమిటేషన్ చేస్తే ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ ఎంపీ సీట్లు వస్తాయి. దక్షిణాది రాష్ట్రాల్లో(South States) సీట్ల సంఖ్య పెరుగుదల ఎక్కువగా ఉండే అవకాశం లేకపోవడంతో ఆయా రాష్ట్రాల సీఎంలు ఆందోళన చెందుతున్నారు. భవిష్యత్‌లో కేంద్రంలో తమ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని చెబుతున్నారు.
Delimitation | కేంద్రంపై పోరుకు సై..
డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా కేంద్రంపై పోరుకు దక్షిణాది రాష్ట్రాలు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్(Stalin) ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 22న తమిళనాడులో నిర్వహించే సమావేశానికి దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించారు. 1971 లెక్కల ప్రకారమే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని సౌత్ స్టేట్స్ కోరుతున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి(Revanth Reddy) కూడా డీలిమిటేషన్‌ను వ్యతిరేకించారు. స్టాలిన్ నిర్వహించే సమావేశానికి వెళ్తానని ప్రకటించారు.