అక్షరటుడే, వెబ్ డెస్క్: కేవలం ఇంటర్ విద్యతో కేంద్ర ప్రభుత్వ కొలువు అందుకునే సదావకాశం రైల్వే శాఖ కల్పించింది. నాన్ టెక్నికల్ కింద 3,693 పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ (ఎన్టీపీసీ)లో కమర్షియల్ కం టికెట్ క్లర్క్-2022, అకౌంట్స్ క్లర్క్ కం టైపిస్ట్-361, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్-990, ట్రెయిన్స్ క్లర్క్-72 ఖాళీలున్నాయి. దివ్యాంగుల కోసం 248 పోస్టులు చేర్చారు. వీటిలో కమర్షియల్ క్లర్క్ కమ్ టికెట్ క్లర్క్ కొలువులకు లెవెల్-3 జీతం చెల్లిస్తారు. వీరికి రూ. 21,700 మూలవేతనం ఉంటుంది. అన్నీ కలిపి సుమారు రూ.40 వేలు అందుకోవచ్చు. మిగతావి లెవెల్-2 ఉద్యోగాలు. వీటికి రూ.19,900 మూలవేతనం చెల్లిస్తారు. అన్నీ కలిపి సుమారు రూ.36 వేలు మొదటి నెల నుంచే పొందవచ్చు.

ఇవీ అర్హతలు..

ఇంటర్మీడియట్ లేదా తత్సమానం.

వయసు: జనవరి 1, 2025 నాటికి 18 నుంచి 33 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు కేటగిరీ ప్రకారం 10-15 ఏళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు ఉంటాయి.

ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబరు 27. https://www.rrbapply.gov.in/ వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక విధానం..

రెండు దశల్లో నిర్వహించే కంప్యూటర్ బేస్డ్ టెస్టు(సీబీటీ)లో ప్రావీణ్యం తప్పనిసరి. టైపిస్ట్ (అకౌంట్స్ క్లర్క్, జూనియర్ క్లర్క్) పోస్టులకు టైపింగ్ స్కిల్ టెస్టు(టీఎస్ఈ) నిర్వహిస్తారు. ఆ తర్వాత ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు నిర్వహించి ఉద్యోగంలోకి తీసుకుంటారు.

స్టేజ్-1: వంద ప్రశ్నలు. వీటికి 90 నిమిషాలు సమయం ఇస్తారు. జనరల్ అవేర్నెస్ 40, మ్యాథమెటిక్స్ 30, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 ప్రశ్నలు ఉంటాయి.

స్టేజ్-2: స్టేజ్-1లో అర్హత పొందినవారి నుంచి, కేటగిరీల వారీ ఉన్న ఖాళీలకు మెరిట్ ప్రకారం 15 రెట్ల మందిని స్టేజ్-2కు అవకాశమిస్తారు. దీన్ని 120 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. జనరల్ అవేర్నెస్ 50, మ్యాథమెటిక్స్ 35, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 35 ప్రశ్నలు వస్తాయి.

కొలువు పొందాలంటే..

స్టేజ్-1, స్టేజ్-2లలో అన్ రిజర్వ్, ఈడబ్ల్యుఎస్ 40, ఓబీసీ ఎన్సీఎల్, ఎస్సీ 30, ఎస్టీ 25 శాతం మార్కులు పొందాలి. పీడబ్ల్యుడీలైతే వారి కేటగిరీ ప్రకారం అదనంగా మరో 2 శాతం మినహాయింపు దక్కుతుంది. రెండు దశల్లోనూ ప్రతి తప్పు సమాధానానికీ 1/3 మార్కు తగ్గిస్తారు. టైపిస్ట్ పోస్టులకు పోటీ పడేవారికి.. స్టేజ్-2లో అర్హుల జాబితా నుంచి మెరిట్ ప్రకారం కేటగిరీల వారీ ఖాళీలకు 8 రెట్ల సంఖ్యలో టైపింగ్ స్కిల్ టెస్టు నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధిస్తే సరిపోతుంది. ఇంగ్లిష్ లో నిమిషానికి 30 పదాలు టైప్ చేయాలి.

సిలబస్ ఇలా..

  • మ్యాథమెటిక్స్: నంబర్ సిస్టం, డెసిమల్స్, భిన్నాలు, కసాగు, గసాభా, రేషియో అండ్ ప్రపోర్షన్, శాతాలు, మెన్సురేషన్, కాలం-పని, కాలం-దూరం, బారు, చక్ర వడ్డీలు, లాభ నష్టాలు, ఎలిమెంటరీ ఆల్జీబ్రా, చలన జ్యామితి, త్రికోణమితి, ప్రాథమిక సాంఖ్యకశాస్త్రం.
  • జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్: అనాలజీలు, నంబర్ అండ్ ఆల్ఫాబెటికల్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, పోలికలు-భేదాలు, సంబంధాలు, అనలిటికల్ రీజనింగ్, సిలాజిజం, జంబ్లింగ్, వెన్ డయాగ్రామ్స్, పజిల్, డేటా సఫిషియన్సీ, స్టేట్మెంట్-కనెక్లూజన్, స్టేట్మెంట్-కోర్సెస్ ఆఫ్ యాక్షన్, డెసిషసన్ మేకింగ్, మ్యాప్ లు, ఇంటర్ ప్రెటేషన్ ఆఫ్ గ్రాఫ్స్.
  • జనరల్ అవేర్నెస్: జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రాముఖ్యం సంతరించుకున్న తాజా సంఘటనలు, క్రీడలు, భారతీయ కళలు, సంస్కృతి, సాహిత్యం, చరిత్రక, దర్శనీయ స్థలాలు, పదో తరగతి స్థాయిలో జనరల్ సైన్స్, లైఫ్ సైన్స్, భారతదేశ చరిత్ర, స్వాతంత్య్రోద్యమం, భారతదేశ, ప్రపంచ జాగ్రఫీ, భారత ప్రభుత్వం, రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ, సైన్స్ అండ్ టెక్నాలజీలో భారత్, ప్రపంచవ్యాప్త అభివృద్ధి, స్పేస్, న్యూక్లియర్ కార్యక్రమాలు, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పర్యావరణ సమస్యలు, కంప్యూటర్లు, వాటి అనువర్తనాలకు సంబంధించి ప్రాథమికాంశాలు, అబ్రివేషన్లు, దేశ రవాణా వ్యవస్థ, దేశ ఎకానమీ, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖులు, ప్రభుత్వ ముఖ్య కార్యక్రమాలు, మన భూభాగంలోని వృక్షాలు, జంతువులు, దేశంలో ముఖ్యమైన ప్రభుత్వ, పబ్లిక్ సెక్టార్ సంస్థలు.