అక్షరటుడే, వెబ్ డెస్క్ : ప్రభుత్వం విడుదల చేసే నిధులను రుణమాఫీకే వినియోగించాలని.. ఇతర అప్పులకు ఎట్టి పరిస్థితుల్లోనూ జమ చేయొద్దని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క స్పష్టం చేశారు. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి గురువారం ఉదయం ప్రజా భవన్ లో బ్యాంకర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు రుణమాఫీ దేశంలోనే చరిత్రాత్మక నిర్ణయమని తెలిపారు. ఆగస్టు నెల దాటకముందే రుణమాఫీ కింద రూ.31వేల కోట్లు విడుదల చేస్తామన్నారు. 11 లక్షలకు పైగా రైతులకు రూ.6 వేల కోట్లు విడుదల చేస్తున్నామన్నారు. ఈ నెలలలోనే రెండో విడత రూ.లక్షన్నర వరకు బకాయి ఉన్న రైతులకు, ఆ తర్వాత రూ.2 లక్షల వరకు రుణాలకు నిధులు విడుదల చేస్తామని చెప్పారు. రూ.2 లక్షలకు పైబడి రుణం ఉన్న రైతులతో బ్యాంకర్లు మాట్లాడి మిగిలిన మొత్తాన్ని రికవరీ చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం మంజూరు చేసే రూ.2 లక్షలు కలిపి మొత్తంగా ఏ రైతు రుణ బకాయి ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

Advertisement
Advertisement

సంతకాలు చేసి ప్రచారంలోకి..

అసెంబ్లీ ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేతగా తాను రైతు రుణమాఫీ గ్యారంటీ కార్డుపై సంతకం చేసి ప్రచారంలోకి వెళ్లామని భట్టి విక్రమార్క గుర్తుచేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి రైతు రుణమాఫీ అమలు చేసి చూపిస్తున్నామన్నారు. రూ.31 వేల కోట్ల నిధులను 40 లక్షల బ్యాంకు ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుందని.. దేశ బ్యాంకింగ్ రంగంలో ఇంత పెద్దమొత్తంలో ఒకేసారి రికవరీ కావడం ఓ చరిత్ర అని పేర్కొన్నారు. కార్పొరేట్ బ్యాంకింగ్ లోనూ ఇంతలా ఒకేసారి జరగలేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం.. బ్యాంకింగ్ వ్యవస్థకు పెద్ద ప్రోత్సాహమని చెప్పారు. రైతుల తరహాలోనే బ్యాంకర్లు కూడా పండుగా చేసుకోవాలని సూచించారు. వ్యవసాయరంగ అభివృద్ధి కోసం భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతోందని తెలిపారు. రైతు రుణమాఫీ కింద వచ్చిన నిధులను బ్యాంకర్లు జమ చేసుకొని.. భవిష్యత్తు అవసరాల కోసం రైతులకు వెంటనే రుణాలు మంజూరు చేయాలన్నారు. రుణాలు ఇచ్చే విషయంలో ఎక్కడా అశ్రద్ధ చూపొద్దని స్పష్టం చేశారు. లీడ్ బ్యాంకు పెద్దన్న పాత్ర పోషించాలని కోరారు.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Bharat Summit | హైదరాబాద్​లో భారత్​ సమ్మిట్​.. హాజరు కానున్న 98 దేశాల ప్రతినిధులు