అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: సమస్త శక్తులకు మూలాధారమైన పరమాత్మశక్తి.. సర్వోన్నత దైవిక శక్తి.. సృష్టి, స్థితి, లయలకు కారణమైన తత్వశక్తిగా భావించే ఆది పరాశక్తిని విభిన్న (దుర్గా, పార్వతి, కాళీ, లక్ష్మీ, సరస్వతి వంటి) దేవతల రూపాల్లో కొలిచే దేవి నవరాత్రి వేడుకలు గురువారం ప్రారంభమయ్యాయి. అమ్మవారు సాయంత్రం మండపాల్లో కొలువు దీరనున్నారు. ఇందుకోసం నిర్వాహకులు మండపాలను అందంగా ముస్తాబు చేశారు. తొమ్మిది రోజుల పాటు అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

రోజుకో అవతారం

  • మొదటి రోజు అమ్మవారు బాలాత్రిపుర సుందరీ దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈ రోజు దేవికి లేత గులాబీ రంగు వస్త్రాన్ని సమర్పిస్తారు. అమ్మవారికి నైవేద్యంగా ఈ రోజు క్షీరాన్నం సమర్పిస్తారు. ఈ రోజు కుమారి పూజ విశేషంగా నిర్వహిస్తారు.
  • రెండో రోజు అమ్మవారు వేదమాత శ్రీ గాయత్రీ దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈ రోజు అమ్మవారికి నారింజ రంగు వస్త్రం సమర్పిస్తారు. ప్రసాదంగా కొబ్బరి అన్నం నివేదిస్తారు.
  • మూడో రోజు అమ్మవారు ప్రాణకోటి ఆకలి తీర్చే అన్నపూర్ణ మాతగా దర్శనమిస్తారు. అమ్మవారికి లేత పసుపు రంగు వస్త్రాన్ని సమర్పిస్తారు. నైవేద్యంగా అల్లం గారెలు నివేదిస్తారు.
  • నాలుగో రోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈ రోజు అమ్మవారికి ముదురు బంగారు రంగు వస్త్రంతో అలంకరిస్తారు. నైవేద్యంగా కదంబం ప్రసాదం సమర్పిస్తారు.
  • ఐదో రోజు శ్రీ చండీ దేవిగా దర్శనమిస్తారు. లోక కంటకులైన రాక్షసులను సంహరించడానికి అమ్మవారు ధరించిన అవతారమే ఇది. ఈ రోజు అమ్మవారి ఎర్రని పూలతో పూజిస్తారు. ఎర్రని వస్త్రాన్ని సమర్పిస్తారు. చింతపండు పులిహోర, రవ్వ కేసరి వంటివి నైవేద్యంగా నివేదిస్తారు.
  • ఆరో రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మి దేవిగా దర్శనమిస్తారు. ఈ రోజు అమ్మవారిని ముదురు గులాబీ రంగు వస్త్రంతో అలంకరిస్తారు. నైవేద్యంగా పూర్ణం బూరెలు సమర్పిస్తారు.
  • ఏడో రోజు సరస్వతీ దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవారిని తెల్లని వస్త్రంతో అలంకరిస్తారు. నైవేద్యంగా దద్దోజనం నివేదిస్తారు.
  • ఎనిమిదో రోజు దుర్గాష్టమి పర్వదినం. దుర్గతులను రూపుమాపే దుర్గావతారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ రోజు అమ్మవారికి ఎర్రని వస్త్రం సమర్పిస్తారు. నిమ్మకాయ పులిహోర నైవేద్యంగా నివేదిస్తారు.
  • తొమ్మిదో రోజు మహర్నవమి పర్వదినం. ఈ రోజునే మహిషుడనే రాక్షసుడిని సంహరించిన అమ్మవారు మహిషాసుర మర్ధినిగా దర్శనమిస్తారు. అమ్మవారిని ఆకు పచ్చని వస్త్రంతో అలంకరిస్తారు. నైవేద్యంగా చక్ర పొంగలి సమర్పిస్తారు.

విజయదశమి

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిర్వహించుకునే విజయదశమి పర్వదినం రోజున అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా దర్శనమిస్తారు. ఈ రోజు అమ్మవారికి ఎరుపు, ఆకుపచ్చ రంగు వస్త్రాలను సమర్పిస్తారు. లడ్డూలు, చింతపండు పులిహోర, రవ్వ కేసరి నైవేద్యంగా నివేదిస్తారు.

content writer : నరేశ్ చందన్