Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​: మహా శివరాత్రి వేళ కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి అధికారులు పలు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ప్రయాగ్​ రాజ్​ను మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి నోవెహికిల్ జోన్​గా అధికారులు ప్రకటించారు. మహా శివరాత్రి వేళ భారీ సంఖ్యలో భక్తులు తరలిరానున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

సాయంత్రం నుంచి ఆంక్షల అమలు..

మహా కుంభమేళా చివరి అంకానికి చేరుకోవడంతో పాటు మహా శివరాత్రి సందర్భంగా భక్తులు భారీగా రానున్నారు. ఈ నేపథ్యంలో పలు అధికారులు ఆంక్షలు అమలు చేయనున్నారు. సందర్శకులందరూ మార్గదర్శకాలను పాటించాలని సూచిస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు ఈ ఆంక్షలు విధించారు. కాగా.. అధికారిక, నిత్యావసరాలను తీసుకువెళ్లే వాహనాలకు మినహాయింపు ఉంటుంది.

ఘాట్లకు వెళ్లేందుకు ఎంట్రీ పాయింట్లు ఇవే..

భక్తులు ఎంట్రీ పాయింట్ల ఆధారంగా సమీపంలోని ఘాట్‌లలో మాత్రమే స్నానం చేయాల్సి ఉంటుంది. దక్షిణ ఝూన్సీ మార్గం నుంచి వెళ్లే వారు ఆరైల్ ఘాట్‌ను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఉత్తర ఝూన్సీ మార్గం నుంచి వెళ్లే వారు హరిశ్చంద్ర ఘాట్, పాత జీటీ ఘాట్‌కు వెళ్లాలి. పాండే క్షేత్ర ప్రవేశకులను రామ్ ఘాట్, భరద్వాజ్ ఘాట్, మోరీ ఘాట్, నాగవాసుకి ఘాట్, కాళీ ఘాట్, నుమాన్ ఘాట్‌లకు మళ్లించనున్నారు. ఆరైల్ సెక్టార్ మీదుగా వచ్చే భక్తులు స్నానాల కోసం ఆరైల్ ఘాట్‌ను ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు.

ఇప్పటికే 60 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు

మహా కుంభమేళాలో ఇప్పటికే 60 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు ఆచరించారు. గత నెలలో మౌని అమావాస్య సందర్భంగా ఒకే రోజు 8 కోట్ల మంది భక్తులు తరలివచ్చిన విషయం తెలిసిందే. అదే రోజు తెల్లవారు జామున తొక్కిసలాట జరిగి పదుల సంఖ్యలో భక్తులు మరణించారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ముందస్తు ఆంక్షలు అమలు చేస్తున్నారు. కాగా.. ఇప్పటికే ప్రయాగ్ రాజ్ కు వెళ్లే దారులన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయాయి.

Advertisement