అక్షరటుడే, కామారెడ్డి టౌన్ : మద్యం మత్తులో తరచూ వేధిస్తున్న కొడుకుని హత్య చేసిన తండ్రిని అరెస్టు చేసినట్లు దేవునిపల్లి సీఐ వామన్ రావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని గోసంగి కాలనీకి చెందిన సాయిలు కొడుకు కోదండ రాజు నిత్యం మద్యం తాగి వచ్చి ఇంట్లో వేధించేవాడు. ఈ క్రమంలో కొడుకు వేధింపులు భరించలేక తండ్రి సాయిలు కొడుకును హత్య చేయాలనుకున్నాడు. ఈ మేరకు పట్టణానికి చెందిన అనిల్ తో రూ.లక్ష సుపారి మాట్లాడుకుని, గత నెల 29న రాజుకు మద్యం తాగించి స్పృహ లేకుండా చేశారు. అనంతరం ఉగ్రవాయి శివారులో రాజు మెడకు టవల్ తో ఉరివేసి చంపేసి పారిపోయారు. ఈ మేరకు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రెండు ద్విచక్ర వాహనాలు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. 24 గంటల్లో కేసు ఛేదించడంతో ఎస్పీ సింధు శర్మ, డీఎస్పీ నాగేశ్వరరావు పోలీసులను అభినందించారు.