అక్షరటుడే, కామారెడ్డి: ఏ ఒక్క ఇల్లు కూడా వదలిపెట్టకుండా హౌస్ లిస్టింగ్ పూర్తి చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో మండల ప్రత్యేకాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంటింటి సమగ్ర సర్వే కార్యక్రమంలో భాగంగా మొదటి దశలో చేపట్టిన హౌస్ లిస్టింగ్ పనులను వెంటనే పూర్తిచేయాలన్నారు. ఎన్యుమరేషన్ బ్లాక్ గ్రామ పంచాయతీల వారీగా నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీవోలు రంగనాథ్ రావు, ప్రభాకర్, మండల ప్రత్యేకాధికారులు పాల్గొన్నారు.