అక్షరటుడే, వెబ్‌డెస్క్: Indiramma Houses | ఇందిరమ్మ ఇళ్ల పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేసి అర్హుల జాబితాను గ్రామసభల్లో ప్రదర్శించిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ద్వారా సర్వే చేపట్టారు. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం తెలిపినట్లు సమాచారం. కేంద్రం రూపొంచిన యాప్ ద్వారానే సర్వే చేయాలని సూచించినట్లు తెలిసింది. దీని కోసం మళ్లీ సర్వే చేపట్టాలని ఆదేశించింది. లేకపోతే కేంద్రం నుంచి నిధులు విడుదల చేయమని చెప్పినట్లు సమాచారం.
Indiramma Houses | ఆందోళనలో అర్హులు..
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం అధికారులు తీవ్రంగా శ్రమించి సర్వే చేశారు. ప్రభుత్వం కూడా పలు గ్రామాలను పైలెట్ ప్రాజెక్ట్‌లుగా ఎంపిక చేసి ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించింది. ఇల్లు కట్టుకున్న వారికి దశల వారీగా సాయం అందిస్తామని ప్రకటించింది. అయితే కేంద్ర ప్రభుత్వం పేదల ఇళ్ల నిర్మాణానికి నిధులు విడుదల చేసింది. ఆ నిధులను కలుపుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సాయం చేయాలని నిర్ణయించింది. అయితే తాజాగా కేంద్రం మెలిక పెట్టడంతో మొత్తం నిధులు రాష్ట్ర ప్రభుత్వంపైనే పడే అవకాశం ఉంది. అసలే నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్న సర్కార్ తమకు సాయం చేస్తుందో లేదోనని ఇళ్లు నిర్మించుకుంటున్న వారు ఆందోళన చెందుతున్నారు.
Indiramma Houses | రీ సర్వే సాధ్యమేనా..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సర్వేలు, దరఖాస్తులు తీసుకోవడం తప్పా చేసిందేమి లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇప్పటికే కులగణన విషయంలో రెండు సార్లు సర్వే చేపట్టారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం మళ్లీ సర్వే చేపట్టడం సాధ్యమయ్యే పని కాదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అర్హులు చాలా మంది ఉన్నారని అంతమంది ఇళ్లకు వెళ్లి సర్వే చేపట్టడం కష్టమంటున్నారు. ప్రభుత్వం కూడా మళ్లీ సర్వే అంటే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని భావిస్తుంది. మరీ దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుందో వేచి చూడాలి.