అక్షరటుడే, వెబ్ డెస్క్: ఇంట్లో దోశ చేసుకోవాలంటే ఎంతో శ్రమతో కూడుకున్న పని. కానీ ఇక నుంచి చిటికలో దోశ వేయొచ్చు. అదెలాగంటారా.. చూడటానికి ప్రింటర్ లా ఉన్న ఇదీ దోశలు తయారు చేసే యంత్రం. చదవడానికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదూ. అచ్చం కాగితం, ఫొటో ప్రింటర్ మాదిరే ఉన్న దీనిని చెన్నైకి చెందిన ఓ అంకుర సంస్థ రూపొందించింది. కిచెన్ లోకి ఇప్పటికే రోలు మాయమై మిక్సర్.. పీట, కోలా(రాట్నం) పోయి రోటీ మేకర్, బ్రెడ్ టోస్టర్.. ఇలా ఎన్నో అధునాతన పరికరాలు చేరాయి. తాజాగా ఈ దోశ మేకర్ అందుబాటులోకి వచ్చింది. ఈ పరికరానికి ఓ వైపు ట్రే ఉంటుంది. అందులో పిండి వేస్తే సరిపోతుంది. నిమిషానికి ఒక దోశ వస్తుంది. దోశను ఎంత మందంతో కావాలనుకుంటే ఆ విధంగా మనం మర్పులు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఫ్లిప్ ఆటోమేటిక్ దోశ మేకర్ కు 360 డిగ్రీల ఫుడ్ గ్రేడ్ కోటెడ్ రోలర్ అమర్చి ఉంటుంది. ఈ యంత్రం 1600 వాట్ల విద్యుత్తు శక్తిని వినియోగిస్తుంది. అత్యంత వేగంగా, కచ్చితత్వంతో పనిచేస్తుందని తయారీ సంస్థ పేర్కొంటోంది. పరిమాణం చిన్నగా ఉండటంతో వంట గదిలో ఇట్టే ఇమిడిపోతుంది. ఆటోమేటిక్ సేఫ్టీ కట్ ఆఫ్ ఫీచర్స్ ఉన్నాయి. మూడు నిమిషాలు వినియోగించకపోతే దానంతట అదే పవర్ ఆఫ్ అవడం దీని ప్రత్యేకత. ఈ యంత్రాలు రూ.13 వేల నుంచి అందుబాటులో ఉన్నట్లు తయారీదారులు చెబుతున్నారు.