అక్షరటుడే, వెబ్‌డెస్క్: తమ బంధానికి అడ్డు వస్తున్నాడని ఓ భార్య ప్రియుడితో కలిసి తన భర్తను హత్య చేయించింది. ఈ ఘటన వరంగల్‌లో చోటు చేసుకుంది. వరంగల్‌కు చెందిన డాక్టర్ సుమంత్‌రెడ్డిపై ఎనిమిది రోజుల క్రితం హత్యాయత్నం జరగ్గా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. భార్యే ఆమె ప్రియుడితో కలిసి ఈ ఘాతూకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కాగా.. పోలీసుల విచారణ సందర్భంగా అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేరంలో ఓ పోలీసు కానిస్టేబుల్ పాత్ర కూడా ఉండడం గమనార్హం.
ప్రేమ వివాహం చేసుకొని..
సుమంత్‌రెడ్డికి ఫ్లోరా మరియాతో ప్రేమ వివాహమైంది. అయితే ఆమె శామ్యుల్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయమై తరుచు ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. దీంతో భర్తను అడ్డు తొలగించుకోవాలనుకున్న ఆమె ప్రియుడితో కలిసి పథకం వేసింది. ముందుగా ప్లాన్ వేసుకున్న ప్రకారం ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది.
సహకరించిన కానిస్టేబుల్
సుమంత్‌రెడ్డిని చంపడానికి ఫ్లోరా తన ప్రియుడికి డబ్బు పంపింది. దీంతో శామ్యుల్, సైబరాబాద్‌లో ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న తన మిత్రుడు రాజ్‌కుమార్ సాయంతో ఫిబ్రవరి 20న సుమంత్‌రెడ్డిపై దాడి చేశాడు. తలపై సుత్తితో తీవ్రంగా కొట్టారు. చనిపోయాడనుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు. స్థానికులు గమనించి ఆయనను ఆస్పత్రికి తరలించగా.. శనివారం ఉదయం మృతి చెందాడు. తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా.. ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాగా.. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.