అక్షరటుడే, హైదరాబాద్: Eagles : డేగల నిఘా(surveillance) ప్రత్యేకం. అంతెత్తున ఆకాశం నుంచి భూమిపై ఉన్న చిన్న చిన్న కోడి పిల్లలను సైతం పసిగట్టగలవు. నిఘాలోనూ వాటి స్థానం స్పెషలే. అందుకే ఆ డేగల సేవలను తెలంగాణ పోలీసు శాఖ(Telangana Police Department) డ్రోన్ల కట్టడికి వినియోగించుకోవాలని భావిస్తోంది. అందుకు అనుగుణంగానే డేగలకు శిక్షణ ఇస్తోంది.
Eagles : దేశంలోనే మొట్టమొదటిసారిగా..
శాంతిభద్రతల పరిరక్షణలో నిఘానేత్రం కీలకం. ఇప్పుడు డేగ నేత్రం కూడా భాగం కాబోతోంది. సంఘ విద్రోహ శక్తులు ఎగురవేసే డ్రోన్లను పసిగట్టి ధ్వంసం చేయడమే వీటి పని. దీనికితోడు మరెన్నో రకాల సేవల కోసం వీటిని పోలీసు శాఖలో భాగస్వామ్యం చేస్తున్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ పోలీసులు గరుడ దళాన్ని తీర్చిదిద్దుతున్నారు.
Eagles : వీవీఐపీల రక్షణ..
రాష్ట్రపతి, ప్రధాని, సీఎం వంటి వీవీఐపీలు పాల్గొనే సభలు, సమావేశాలకు పటిష్టమైన భద్రత అవసరం. ఎంతగా మఫ్టీలో కాపు కాసినా.. కొత్త సాంకేతిక పరిజ్ఞానం, డ్రోన్లతో దాడికి అవకాశాలు లేకపోలేదు. అందుకే గగనతలం నుంచి కూడా నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గగన తనం నుంచి నిఘా అంటే.. నిరంతరం విమానం, హెలికాప్టర్ ను గాలిలో ఉంచి కాపు కాయడం కష్టం. ఈ లోటును గరుడ దళం(ఈగిల్ స్క్వాడ్)(Eagle Squad) పూర్తి చేయనుంది. గగనతలం నుంచి నిఘా పెట్టనుంది.
Eagles : ప్రత్యేక శిక్షణ..
తెలంగాణ పోలీసులు మొయినాబాద్ లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ(Integrated Intelligence Training Academy)లో ఇప్పటికే 4 గద్దలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అనుమానాస్పద డ్రోన్లను నేలకూల్చడం, ఆకాశం నుంచి నిఘా పెట్టడంపై శిక్షణ పూర్తి చేశారు. వాటితో ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద డెమో నిర్వహించారు. సుశిక్షితమైన ఈ గరుడ దళాన్ని అంతర్గత భద్రత విభాగం (ఐఎస్ఈడబ్ల్యూ)(Internal Security Wing – ISEW)లో భాగంగా ఉంచి, వీవీఐపీ రక్షణను పర్యవేక్షించనున్నారు.
Eagles : గగనతలం నుంచి నిఘా నేత్రాలుగా..
గరుడ దళం(Garuda Dal) ఏర్పాటుకు మూడేళ్ల క్రితమే అంకురార్పణ జరిగింది. ఎన్నో ప్రతికూల పరిస్థితుల నడుమ నాలుగు గద్దలకు విజయవంతంగా శిక్షణ ఇవ్వగలిగారు. చిన్న పక్షి పిల్లలుగా ఉన్నప్పుడు వాటిని తీసుకొచ్చారు. వెటర్నరీ వైద్యుడి పర్యవేక్షణలో పోషిస్తూ, తర్ఫీదు ఇస్తూ వచ్చారు.
గరుడ దళం నిర్వహణ నిమిత్తం.. ఇద్దరు పోలీసు అధికారులకు కూడా ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. వారితోపాటు కోల్కతా(Kolkata) నుంచి ఇన్స్ట్రక్టర్లను రప్పించారు. వారితో గద్దలకు డ్రోన్లను నేలకూల్చడం, అనుమానాస్పద వ్యక్తులను గమనించడం తదితర అంశాల్లో తర్ఫీదు ఇచ్చారు. దీనికితోడు వాటికి ప్రత్యేక నిఘా కెమెరాలు అమర్చి, వాటి సాయంతో నిఘా పెట్టడాన్ని సైతం పరిశీలించారు.
Eagles : అనుమానం రాకుండా…
సాధారణంగా గగనతలం నుంచి డ్రోన్ల సాయంతో కూడా నిఘా పెట్టవచ్చు. కానీ, వాటి శబ్దం, కదలికల వల్ల నేరస్తులు అలెర్ట్ అయి, వాటికి చిక్కకుండా నేరం చేసి, తప్పించుకునే అవకాశం ఉంది. అదే గద్దల ద్వారా నిఘా పెడితే పసిగట్టడం సాధ్యం కాదు. అందుకే ఈ గరుడ దళం వీవీఐపీల భద్రత, నిఘాలో ప్రత్యేకం కాబోతోంది.