అక్షరటుడే, హైదరాబాద్: Betting Apps : బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాసులకు కక్కుర్తి పడి వేల మంది ప్రాణాలు పోవడానికి కారణమవుతున్న బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోషన్ చేస్తున్న సెలబ్రెటీలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే 11 మందిపై కేసులు నమోదు చేశారు. వీరిని విచారించేందుకు నోటీసులు కూడా జారీచేశారు.
తాజాగా ఈ బెట్టింగ్ యాప్స్ వ్యవహారం కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)(central investigation agency Enforcement Directorate – ED) ఎంట్రీ ఇచ్చింది. బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేసిన యూట్యూబర్ల వ్యవహారంపై ఈడీ ఆరా తీసినట్లు సమాచారం. ఈ మేరకు పోలీసులు నమోదు చేసిన కేసు వివరాలను ఈడీ తెప్పించుకున్నట్లు తెలిసింది. బెట్టింగ్ యాప్స్ చెల్లింపులపై విచారిస్తున్నట్లు సమాచారం.
మనీ లాండరింగ్(money laundering), హవాలా(hawala) రూపంలో వీరికి చెల్లింపులు జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్న ఈడీ.. పోలీసులు కేసు నమోదు చేసిన 11 మంది యూట్యూబర్ల సంపాదనపై ఆరా తీసినట్లు సమాచారం. త్వరలోనే వీరికి నోటీసులు జారీ చేసి, విచారణకు పిలిచేందుకు ఈడీ సిద్ధం అవుతున్నట్లు ప్రచారంలో ఉంది. ఈడీ ఎంట్రీతో ఈ కేసుపై ఉత్కంఠ నెలకొంది.
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్న 11 మంది తెలుగు యూట్యూబర్లు(YouTubers), సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్ల(social media influencers)పై గేమింగ్ యాక్ట్(Gaming Act) కింద పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో విష్ణుప్రియ, బండారు శేషసాయిని, సుప్రిత, రీతు చౌదరి, టేస్టీ తేజ, యాంకర్ శ్యామల, కిరణ్ గౌడ్, ఇమ్రాన్ ఖాన్ (పరేషన్ బాయ్స్), హర్ష సాయి, అజయ్, సన్నీ యాదవ్, సుదీర్ ఉన్నారు.