అక్షరటుడే, ఇందూరు: రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 6 నుంచి నిర్వహించనున్న సమగ్ర కుటుంబ సర్వేలో ప్రాథమిక పాఠశాలల ఎస్జీటీలు, హెచ్ఎంలు, నాన్ టీచింగ్ స్టాఫ్ పాల్గొనాలని రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సర్వేకు రాష్ట్ర వ్యాప్తంగా 80 వేల మంది ఉద్యోగులను వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా విద్యాశాఖ నుంచి సుమారు 50 వేల మందికి సర్వే డ్యూటీ వేయనున్నారు. ఇందులో ఎస్జీటీలు 36,559 మంది, ప్రైమరీ స్కూల్ హెచ్ఎంలు 3,414 మంది, ఎంఆర్సీలు 6,256 మంది, నాన్ టీచింగ్ సిబ్బంది 2వేల మందితో మూడు వారాల పాటు ఇంటింటి సర్వే చేపట్టనున్నారు. అయితే ప్రాథమిక పాఠశాలలకు ఒంటి పూట తరగతులు ఉదయం 9 నుంచి 1 గంటల వరకు నిర్వహించి, మధ్యాహ్న భోజనం అనంతరం టీచర్లు సర్వే చేపట్టాలని ఉన్నతాధికారులు సూచించారు.

జిల్లాలో సుమారు రెండున్నర వేల మంది..

సమగ్ర కుటుంబ సర్వే కు జిల్లా విద్యాశాఖ నుంచి అవసరాన్ని బట్టి ఉపాధ్యాయులు, నాన్ టీచింగ్ స్టాఫ్ కు విధులు వేయనున్నారు. ఇప్పటికే ఈ ప్రక్రియ పూర్తయినట్లు తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలలో పనిచేసే ఎస్జీటీలు సుమారు 2 వేల మంది, నాన్ టీచింగ్ స్టాఫ్ 300 మంది ఉంటారు. అయితే తహశీల్దార్లు తమ మండలాల్లో అవసరం మేరకు ఉపాధ్యాయులను సర్వే కు ఉపయోగించుకోనున్నారు.