అక్షరటుడే, వెబ్‌డెస్క్: కమిషనరేట్‌లో ఇటీవల ఎనిమిది మంది సీఐలను బదిలీ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వు రద్దయ్యింది. ఈమేరకు ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ముఖ్యంగా నిజామాబాద్ నగరంలో కొత్తగా కేటాయించిన ఇద్దరు సీఐల పోస్టింగుపై వివాదం ఏర్పడింది. అర్బన్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జిగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సమ్మతి లేకుండానే నగర సీఐ, ఒకటో టౌన్ ఎస్‌హెచ్‌వో నియామకం జరిగినట్లు తెలుస్తోంది. అయితే అప్పటికే ఈ రెండు పోస్టింగుల్లో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాస్, ప్రసాద్ కోసం కాంగ్రెస్ నేతలు పైరవీలు చేశారు. ఇంతలోనే వారికి తెలియకుండా పోస్టింగుల ఉత్తర్వులు రావడం చర్చకు దారితీసింది. కాగా.. ఐజీ ఆఫీస్ ఆదేశాలతో సీపీ కార్యాలయం అధికారులు విడుదల చేసిన కౌంటర్ డీవోను నిలిపివేశారు. బదిలీ అయిన సీఐలకు ఫోన్‌చేసి ప్రస్తుత స్థానాల్లో యథావిధిగా కొనసాగాలని, రిలీవ్ కావొద్దని సూచించారు. ఒకటి రెండ్రోజుల్లో పూర్తి స్పష్టత వస్తుందని సీఐలు ఎదురుచూశారు. తీరా సదరు బదిలీలు రద్దయినట్లు తెలిసింది. అయితే కమిషనరేట్‌లో పోస్టింగుల కోసం ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరకు సీపీ కల్మేశ్వర్ నిర్ణయమే కీలకం కానుంది. ఇటీవల ఆర్మూర్, డిచ్‌పల్లి సీఐల బదిలీలు జరిగి ఆ వెంటనే రద్దు కావడం ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది.