Kamareddy | నకిలీ స్టాంపుల దందా.. అయినా పట్టింపులేదా..!

Kamareddy | నకిలీ స్టాంపుల దందా
Kamareddy | నకిలీ స్టాంపుల దందా
Advertisement

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | కామారెడ్డి జిల్లాలో నకిలీ స్టాంపుల దందా జోరుగా సాగుతోంది. ఇటీవల దోమకొండ గ్రామ పంచాయతీ సెక్రెటరీ సంతకం ఫోర్జరీ చేయడమే కాకుండా.. జీపీ పేరిట నకిలీ స్టాంపు, రశీదు పుస్తకాలు సృషించడం జిల్లాలో కలకలం రేపింది. ఈ ముఠాల కారణంగా ఎంతో మంది మోసపోతున్నారు. అయినా అధికారులు చోద్యం చూస్తున్నారు.

జిల్లా కేంద్రంలో కొందరు స్టాంపు మేకర్లు ఇష్టారీతిన ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల రబ్బర్‌ స్టాంపులను తయారు చేస్తున్నారు. దీంతో కొందరు అక్రమార్కులు ఏకంగా ప్రభుత్వ అధికారులు, కార్యాలయాల నకిలీ స్టాంపులు తయారు చేయించుకుని అక్రమాలకు పాల్పడుతున్నారు. కొందరు స్టాంపు మేకర్లు అధిక డబ్బులు వసూలకు ఆశపడి వీటిని తయారు చేసిస్తున్నారు. ఈ క్రమంలోనే ఫోర్జరీ పత్రాలు బయటకు పుట్టుకొస్తున్నాయి. తాజాగా దోమకొండ ఘటనలో అరెస్టయిన వారిలో ఓ స్టాంప్‌మేకర్‌ కూడా ఉండడం ఇందుకు నిదర్శనం.

Kamareddy | డబ్బులిస్తే ఏదైనా…

కామారెడ్డి పట్టణంలో అధికారిక లెక్కల ప్రకారం రబ్బరు స్టాంపుల తయారీ షాపులు రెండు మాత్రమే ఉన్నాయి. మున్సిపల్‌ కార్యాలయం వద్ద, కొత్త బస్టాండ్‌ ప్రాంతంలో ఈ దుకాణాలు ఉండగా.. అనధికారికంగా మరోచోట నకిలీ స్టాంపులు తయారు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఒక్కో స్టాంపు తయారీకి రూ.2 వేల పైబడి వసూలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఇది కూడా చ‌ద‌వండి :  Kamareddy | హైవేపై డివైడర్​ను ఢీకొన్న బైకు.. యువకుడు మృతి

Kamareddy | అనుమతి లేకుండానే..

వాస్తవానికి అధికారిక స్టాంప్‌ తయారు చేయాలంటే సంబంధిత అధికారి లేదా సంస్థ నుంచి లెటర్ ఉండాలి. ఆ తర్వాతే స్టాంప్‌ తయారు చేసివ్వాలి. కానీ, ఇక్కడ డబ్బులిస్తే ఏ అధికారి స్టాంప్‌ అయినా నకిలీవి వెంటనే తయారు చేసిస్తున్నట్లు తాజా ఘటనతో అర్థమవుతోంది. నకిలీ స్టాంపులతో ఎన్ని అక్రమాలు జరిగాయోనన్న చర్చ నడుస్తోంది. ఇకనైనా అధికారులు నకిలీ స్టాంపులు, రశీదు పుస్తకాల తయారీకి సంబంధించిన కేసును లోతుగా దర్యాప్తు చేపట్టి.. ఫోర్జరీ ముఠాలను బయటకు లాగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Advertisement