నకిలీ మహిళా ఎస్సై అరెస్టు

0

అక్షరటుడే, వెబ్ డెస్క్: ఓ యువతి ఏకంగా నకిలీ ఎస్సై అవతారం ఎత్తి ఆలయాల్లో వీఐపీ దర్శనాలు చేయించుకుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు చేసుకుంది. చివరకు ఎస్సై యూనిఫాంలోనే రీల్స్ చేయడమే కాకుండా ఓ పెళ్లి సంబంధం చూసేందుకు వెళ్ళింది. సీన్ కట్ చేస్తే.. సదరు నకిలీ ఎస్సై బండారం బయటపడింది. ఎట్టకేలకు పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. నల్గొండ జిల్లా నార్కట్ పల్లికి చెందిన యువతి మాళవిక నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేసి 2018లో అర్.పి.ఎఫ్ ఎస్సై పరీక్ష అన్ని అర్హతలు సాధించింది. చివరకు మెడికల్ చెకప్‌లో దృష్టి లోపం కారణంగా తిరస్కరణకు గురైంది. అయితే అప్పటికే తల్లిదండ్రులతో పాటు బంధువులకు తాను ఎస్సై అవుతున్నట్లు చెప్పుకుంది. తన పరువు పోతుందని భావించిన మాళవిక ఎస్సై యూనిఫాం కుట్టించుకోవడంతో పాటు, నకిలీ ఐడి కార్డ్ చేయించుకుంది. శంకర్ పల్లిలో విధులు నిర్వహిస్తున్నట్లు నమ్మించింది. తీరా పెళ్లి సంబంధాల కోసం అబ్బాయి తరపున కుటుంబీకులు వివరాలు ఆరా తీయడంతో నకిలీ ఎస్సైగా తేలింది. అర్.పి.ఎఫ్ పోలీసులు మాళవికను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.