అక్షరటుడే, జుక్కల్: అన్నదాతలను వర్షాలు ఆగం చేస్తున్నాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చిన సమయంలో వానలు పడుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో ధాన్యం కోతలు ఊపందుకున్నాయి. పలు గ్రామాల్లో పొలాలు కోసి వడ్లను కొనుగోలు కేంద్రాలు, రోడ్లపై ఆరబెట్టారు. అయితే గత వారం, పది రోజులుగా నిత్యం వర్షం పడుతుండడంతో ధాన్యం ఆరబెట్టడానికి రైతులు అనేక తిప్పలు పడుతున్నారు. ఉదయం ధాన్యం కుప్పలను విప్పి ఆరబోయగానే వర్షం పడుతుండడంతో హడావుడిగా మళ్లీ కుప్పలు చేస్తున్నారు. అంతలోనే మళ్లీ ఎండ వస్తుండడంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. మంగళవారం మధ్యాహ్నం మహమ్మద్ నగర్ మండలంలో భారీ వర్షం కురిసింది. దీంతో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 10 రోజులవుతున్నా ఇంకా తూకాలు ప్రారంభించలేదు. దీంతో ధాన్యాన్ని కాపాడుకోవడానికి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించాలని కోరుతున్నారు.