అక్షరటుడే, వెబ్‌డెస్క్: Budget | రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్(Budget)లో రైతుల(Farmers)కు పెద్దపీట వేసింది. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు భారీగా కేటాయింపులు చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) బుధవారం అసెంబ్లీ(Assembly)లో బడ్జెట్ ప్రవేశ పెట్టారు.
వ్యవసాయ రంగానికి(Agriculture) రూ.24,439 కోట్లు, నీరుపారుదల శాఖకు రూ.23,373 కోట్లు కేటాయించారు. రైతు భరోసా(Rythu Bharosa) పథకం కింద ఏడాదికి ఎకరాకు రూ.12 వేలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకానికి బడ్జెట్లో రూ.18 వేల కోట్లు కేటాయించారు. దీంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని రైతులకు మేలు జరగనుంది. నిజామాబాద్ జిల్లాలో 2.62లక్షల మంది, కామారెడ్డిలో 3.25 లక్షల మంది రైతులున్నారు.
Budget | పేదల ఇళ్ల కోసం నిధులు
తాము అధికారంలోకి వచ్చాక పేదల సొంతింటి కల నెరవేరుస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా జనవరి 26న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని(Indiramma Houses) ప్రారంభించింది. తాజాగా బడ్జెట్లో ఈ పథకానికి కేటాయింపులు చేసింది. నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున నిర్మాణానికి తొలి విడతలో ఆర్థిక సాయం చేస్తామని డిప్యూటీ సీఎం ప్రకటించారు. ఇందుకోసం రూ.12,751 కోట్లు కేటాయించారు. ఉమ్మడి నిజామాబాద్(Nizamabad) జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాలకు 31,500 ఇళ్లు రానున్నాయి. అలాగే గతంలో నిర్మాణం పూర్తయిన, అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్ల పనుల కోసం నిధులు కేటాయించారు. వీటితో పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించనున్నారు. ఉమ్మడి జిల్లాలో కూడా చాలా ప్రాంతాల్లో డబుల్ బెడ్రూం ఇళ్లు అసంపూర్తిగా ఉన్నాయి.
Budget | ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల ఏర్పాటు
ఉన్నత ప్రమాణాలతో ఉచిత విద్య అందించడానికి ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు(Integrated Schools) ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఒక్కో పాఠశాలను 20 ఎకరాల విస్తీర్ణంలో కార్పొరేట్ స్థాయిలో ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని ఆర్మూర్, నిజామాబాద్ రూరల్, జుక్కల్ నియోజకవర్గాలకు ఇంటిగ్రేటేడ్ స్కూళ్లు మంజూరయ్యాయి. తాజాగా వీటి నిర్మాణానికి బడ్జెట్లో నిధులు కేటాయించడంతో ఉమ్మడి జిల్లా విద్యార్థులకు మేలు జరగనుంది.
Budget | భూ భారతితో సమస్యలు తీరేనా..
ధరణి(Dharani) పోర్టల్ స్థానంలో సమగ్ర భూ సమాచారంతో భూ భారతి(BhuBharathi) తీసుకొస్తామని బడ్జెట్ ప్రసంగంలో భట్టి విక్రమార్క తెలిపారు. ధరణి సాంకేతిక లోపాలతో ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే వేలాది మంది రైతులు అవస్థలు పడుతున్నారు. కొత్త చట్టం వస్తే తమ సమస్యలు తీరుతాయని వారు భావిస్తున్నారు. మరోవైపు గ్రామీణ స్థాయిలో భూపరిపాలనను సులభతరం చేయడానికి రాష్ట్రంలో 10,954 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. దీంతో ఉమ్మడి జిల్లాలోని ఆయా గ్రామాల్లో పోస్టులు భర్తీ కావడంతో పాటు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లభించనున్నాయి.
Budget | రుణమాఫీపై స్పష్టత కరువు
అధికారంలోకి వచ్చాక రూ.రెండు లక్షలలోపు రుణమాఫీ (Loan Waiver) చేస్తామని కాంగ్రెస్(Congress) చెప్పింది. అయితే ఉమ్మడి జిల్లాలో చాలా మంది రుణమాఫీ కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. రూ.రెండు లక్షలపై రుణం ఉన్న వారికి అసలు మాఫీ కానేలేదు. అయితే బడ్జెట్లో రుణమాఫీ గురించి ప్రస్తావించకపోవడంపై లోన్ మాఫీ కాని రైతులు పెదవి విరుస్తున్నారు.
Budget | పంచాయతీ రాజ్‌కు భారీగా కేటాయింపులు
రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖకు భారీగా నిధులు కేటాయించింది. ఈ శాఖకు రూ.31,605 కోట్లు కేటాయించారు. ఇది మొత్తం బడ్జెట్లో పదిశాతం కంటే ఎక్కువ కావడం గమనార్హం. అయితే ఈ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో సౌకర్యాలు మెరుగు పరచనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఉమ్మడి జిల్లాలో పలు గ్రామాలకు సరైన రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే పంచాయతీ భవనాలు, ఇతర మౌలిక వసతులు ఈ నిధులతో చేపట్టే అవకాశం ఉంది.