అక్షరటుడే, జుక్కల్‌: ఖాళీ జాగా కనిపిస్తే చాలు అక్రమార్కులు పాగా వేసేస్తున్నారు. తాజాగా నిజాంసాగర్‌ మండలం వడ్డేపల్లి శివారులోని కొత్త చెరువును కొంతమంది అక్రమార్కులు కబ్జా చేశారు. దీంతో సోమవారం గ్రామ రైతులు తహసీల్దార్‌ భిక్షపతికి ఫిర్యాదు చేశారు. చెరువులో ఎత్తుగా కట్టలు పోస్తుండడంతో క్రమంగా చెరువు కుచించుకుపోతోందని, ఏటా చెరువు కింద రెండుపంటలు సాగైతే, ఈసారి ఒక్క పంటకే సాగునీరందే పరిస్థితి నెలకొందని గ్రామ రైతులు వాపోతున్నారు. ఎండాకాలంలో తాగునీటికీ ఇబ్బంది ఏర్పడుతోందని తహసీల్దార్‌కు వివరించారు. చెరువును కబ్జా బారి నుంచి కాపాడాలని కోరారు. దీంతో స్పందించిన తహసీల్దార్‌ విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రైతులకు హామీ ఇచ్చారు.