అక్షరటుడే, ఎల్లారెడ్డి: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.రెండు లక్షలలోపు పంట రుణాలు వెంటనే మాఫీ చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం గాంధారిలో కామారెడ్డి- బాన్సువాడ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. రైతును కన్నీరు పెట్టించిన ఏ ప్రభుత్వం ముందర పడలేదన్నారు. రైతు భరోసా విడుదల చేయాలన్నారు. లేనిపక్షంలో సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామన్నారు. రైతుల ధర్నాకు ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సురేందర్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి తప్ప.. ఇప్పటికీ కొత్తగా ఎలాంటి పనులు చేయలేదని విమర్శించారు. గాంధారి మండలంలోని బుగ్గ గండి రోడ్డుకు రూ. 14 కోట్ల నిధులు తీసుకొచ్చి పనులు ప్రారంభించామని.. ఇప్పటికీ ఆ రోడ్డుపై డాంబర్ వెయ్యలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, కల్యాణ లక్ష్మి, తులం బంగారం ఎక్కడ పోయాయని ప్రశ్నించారు. కార్యక్రమంలో గాంధారి మండలంలోని వివిధ పార్టీల నాయకులు, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు.