అక్షరటుడే, బోధన్‌: రెంజల్‌ మండల కేంద్రంలోని కెనరా బ్యాంక్‌ ఎదుట రైతులు ఆందోళనకు దిగారు. బ్యాంకుకు తాళం వేసి నిరసన తెలిపారు. అర్హులైన తమకు రుణమాఫీ రాకపోవడంపై మేనేజర్‌ను నిలదీశారు. బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం మూలంగానే తమ రుణాలు మాఫీ కాలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై బ్యాంకు వద్దకు చేరుకుని రైతులను సముదాయించి బ్యాంకు తాళం తెరిపించారు. ఈ సందర్భంగా బ్యాంకు అధికారులు స్పందించి అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు కృషిచేస్తామని హామీ ఇచ్చారు.