అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో వరుసగా మాజీ ఎమ్మెల్యేలు విచారణకు హాజరవుతుండటం రాష్ట్రంలో సంచలనం రేపుతోంది. మొన్న బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఈ కేసులో విచారణకు హాజరు కాగా, శనివారం కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్‌ ఏసీపీ కార్యాలయంలో ఆయన్ను విచారిస్తున్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఆయనకు ఇటీవల పోలీసులు నోటీసులు అందజేశారు. నిందితుల ఫోన్‌ కాల్‌డేటా ఆధారంగా రాజకీయ నేతలకు నోటీసులు ఇస్తున్నారు. జైపాల్‌ యాదవ్‌ స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డు చేయనున్నారు.