అక్షరటుడే, ఆర్మూర్: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం సన్న, దొడ్డు వడ్లకు రూ.500 బోనస్ చెల్లించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని ఆర్భాటంగా చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోలు వేగంగా సాగడం లేదన్నారు. ప్రభుత్వం బోనస్ ఎగ్గొట్టడానికి ఉద్దేశపూర్వకంగానే ధాన్యం కొనుగోలులో జాప్యం చేస్తోందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ జాప్యంతో విధిలేక రైతులు ప్రైవేటు దళారులకు అమ్మి నష్టపోతున్నారన్నారు. అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ ఇవ్వాలని, లేనిపక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసంపై రైతులతో కలిసి బీఆర్ఎస్ పోరుబాట పడుతుందని ఆయన చెప్పారు.