అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Future City | రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌కు దీటుగా నాలుగో నగరం ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఆ దిశగా శరవేగంగా అడుగులు వేస్తున్నారు. దీంతో సిటీ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయాన్ని నమ్ముకుని బతికే తమ భూములు పోతే ఎలా అని వారు వాపోతున్నారు.
Future City | ఆత్మహత్యాయత్నం
ఫ్యూచర్ సిటీలో భాగంగా గ్రీన్ ఫీల్డ్ రోడ్డు కోసం అధికారులు భూ సేకరణ చేపడుతున్నారు. అయితే తమకు ఎలాంటి పరిహారం ఇవ్వకుండానే భూముల్లో కడిలు పాతడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో సోమవారం రంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట మహేశ్వరం మండలం రావిడాల గ్రామానికి చెందిన ఓ రైతు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేయడం చర్చకు దారితీసింది.
Future City | బడా నేతల భూములు తీసుకోవడం లేదు..
రావిడాల గ్రామానికి చెందిన పలువురు రైతులు మాట్లాడుతూ.. పేదల భూములు మాత్రమే లాక్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతల భూముల జోలికి అధికారులు వెళ్లడం లేదని ఆరోపించారు. తనకున్న మూడు ఎకరాల భూమి తీసుకున్నారని.. కానీ తన పొలం పక్కనే సీఎం రేవంత్ రెడ్డి మేనమామ భూమి 50 ఎకరాలు ఉంటే అది మాత్రం ముట్టుకోవట్లేదని ఓ రైతు ఆరోపించారు. తమకు చెప్పకుండానే పొలాల్లో కడీలు పాతారని వాపోయారు.
Future City | వేగంగా అడుగులు
నాలుగో నగరం నిర్మాణం కోసం ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. శ్రీశైలం, నాగార్జునసాగర్ జాతీయ రహదారుల మధ్యలో ఉన్న ఏడు మండలాలు.. 56 గ్రామ పంచాయతీలతో సుమారు 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మించాలని నిర్ణయించింది. దీని కోసం ఫ్యూచర్ సిటీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (future city urban development authority) కూడా చేస్తూ మంత్రి మండలి ఆమోదం తెలిపింది. హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న 36 గ్రామాలను కూడా ఫ్యూచర్ సిటీలో విలీనం చేయాలని నిర్ణయించింది. ఫ్యూచర్‌సిటీ అభివృద్ధి కోసం కొత్తగా 90 పోస్టులను కూడా మంజూరు చేసింది.
Future City | ప్రతిపక్షాల విమర్శలు
ఫ్యూచర్ సిటీ నిర్మాణం విషయంలో ప్రభుత్వ తీరుపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. రేవంత్‌రెడ్డి డబ్బులు దండుకోవడానికే ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేపడుతున్నారని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం సంక్షేమ పథకాలు అమలు చేయడానికే డబ్బులు లేవంటున్న ప్రభుత్వం.. కొత్త నగరం ఎలా నిర్మిస్తుందని ప్రశ్నించారు. ఇప్పటికీ రైతు రుణమాఫీ, రైతు భరోసా పూర్తిస్థాయిలో వేయలేని రేవంత్ సర్కార్ కొత్త నగరం నిర్మించడానికి నిధులు ఎక్కడి నుంచి తెస్తుందని ప్రశ్నిస్తున్నారు.