అక్షరటుడే, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో రెండో దశ పార్ట్-ఏ లోని నార్త్ సిటీ మెట్రో డీపీఆర్ (North City Metro DPR) సన్నద్ధత పూర్తి కావొస్తోంది. ఈ రెండు కారిడార్లకు సంబంధించి సర్వేలు, మట్టి పరీక్షలు పూర్తయ్యాయి. ఈ నెల చివరి నాటికి ఇతర అంశాలను సైతం డీపీఆర్(DPR) లో చేర్చి, ఏప్రిల్ మొదటివారంలో సర్కారుకు సమర్పించనున్నారు.
మేడ్చల్, శామీర్ పేట్ తో పాటు ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ (Future City)వరకు నిర్మించబోయే మెట్రో డీపీఆర్(Metro DPR) లు మార్చిలోపు ఇవ్వాలని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. కాగా, ఫ్యూచర్ సిటీ డీపీఆర్ ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మేడ్చల్ మార్గంలో డబుల్ డెక్కరా, లేక ప్రత్యేక రూట్లో ఎలివేటెడ్ రూటా.. అనేది ఇంకా నిర్ణయించనట్లు తెలుస్తోంది. కాగా, ఏప్రిల్ మొదటి వారం నాటికి ఉత్తర నగరానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న ఇతర అంశాలను చేర్చి, ఫోర్త్ సిటీ డీపీఆర్(Fourth City DPR) ను సైతం సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేయాలని మెట్రో అధికారులు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు.
మెట్రో డీపీఆర్ రూపకల్పనలో సోషల్, ఎకనామికల్, సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. వాణిజ్య ప్రాంతాలు, జనసాంద్రత ఆధారంగా రైల్వే స్టేషన్లను నిర్ణయించారు. జేబీఎస్(JBS) — మేడ్చల్(Medchal) మార్గంలోని 25, జేబీఎస్ –శామీర్ పేట దారిలోని 19 ప్రాంతాల్లో భూపరీక్షలు పూర్తి చేశారు.
ట్రాఫిక్ సర్వేలో భాగంగా రోజూవారీ ప్రయాణికులు, , శామీర్పేట, మేడ్చల్ ప్రాంతాల్లోని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఐటీ హబ్ (IT hubs)లు, నివాస ప్రాంతాల ఆధారంగా రవాణాను అంచనా వేశారు.
కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగులో ఉన్న సెకండ్ ఫేజ్ లోని ఐదు కారిడార్లకు సంబంధించిన డీపీఆర్ ఆమోదం కోసం ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. సీఎం రేవంత్ పలుమార్లు ఢిల్లీ పెద్దలను కలిసి మెట్రో పొడిగింపునకు సహకరించాలని విన్నవిస్తూ వస్తున్నారు. కానీ, ఐదు నెలలు అవుతున్నా, డీపీఆర్(DPR) మాత్రం ఆమోదానికి నోచుకోవడం లేదు. మెట్రో అధికారులు సైతం సెంట్రల్ అర్బన్ డెవలప్మెంట్ అధికారులతో సంప్రదింపులు కొనసాగిస్తున్నారు.