
అక్షరటుడే, వెబ్‌డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ట్రంప్ టారిఫ్ భయాల నేపథ్యంలో ఎంతవరకు నిలదొక్కుకుంటాయన్నది గమనించాల్సి ఉంది. కాగా మంగళవారం డౌజోన్స్(Dow Jones) మాత్రమే నెగెటివ్‌లో ఉండగా.. ఎస్‌అండ్‌పీ(S P), నాస్‌డాక్(Nasdaq)లు పాజిటివ్‌లో ముగిశాయి. యూరోపియన్ మార్కెట్లు కూడా కోలుకున్నాయి. ఆసియన్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. బుధవారం ఉదయం 8.30 గంటల సమయంలో గిఫ్ట్ నిఫ్టీ(Gift Nifty) 41 పాయింట్ల లాభంతో ఉంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఈ రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత ట్రంప్ టారిఫ్(Tariff) ప్రకటన రానుంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు కాస్త వేచి చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా భారత్ విషయంలో ట్రంప్(Trump) ఆచితూచి వ్యవహరించే అవకాశాలున్నాయని అనలిస్టులు భావిస్తున్నారు. ఇప్పటికే ట్యాక్స్ తగ్గించే విషయంలో మన ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్‌పై టారిఫ్స్ విధించే విషయంలో అమెరికా వెనక్కి తగ్గే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.
Stock market | గమనించాల్సిన అంశాలు..
ట్రంప్ టారిఫ్ భయాలతో స్టాక్ మార్కెట్ మంగళవారం నెగెటివ్‌గా స్పందించింది. టెక్, బ్యాంకింగ్ స్టాక్స్‌లో వీక్‌నెస్, ఎఫ్‌ఐఐల అమ్మకాల ప్రభావంతో ఇండెక్స్‌లు పడిపోయాయి. ఒకవేళ టారిఫ్స్ విధిస్తే టెక్స్‌టైల్స్, క్లోథింగ్, ఆటోమొబైల్, అగ్రి, మీట్, కెమికల్స్, ఫార్మా, జెమ్స్, జువెల్లరీ, ఐరన్ అండ్ స్టీల్ స్టాక్స్‌పై ప్రభావం పడే అవకాశాలున్నాయి.
బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 0.12 శాతం పెరిగి 74.58 డాలర్ల వద్ద ఉంది. రూపాయి విలువ బలపడుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 32 పైసలు పెరిగి, 85.47 వద్ద కొనసాగుతోంది.
ఎఫ్‌ఐఐలు తిరిగి అమ్మకాలకు పాల్పడుతున్నారు. మార్చి 28న నికరంగా రూ. 4,352 కోట్ల విలువైన స్టాక్స్ అమ్మగా.. మంగళవారం రూ. 5,902 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. అలాగే వారు లాంగ్ పొజిషన్స్ కూడా తగ్గించుకుంటున్నారు. ఎఫ్‌ఐఐ(FII)ల లాంగ్ పొజిషన్స్ 35 శాతంనుంచి 31 శాతానికి తగ్గాయి.