అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: పసిడి ధర పట్టపగ్గాల్లేకుండా పరుగు పెడుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా పుత్తడి ధర రూ.74 వేల మార్క్‌ను టచ్‌ చేసింది. ధర పెరుగుదల వేగం చూస్తుంటే త్వరలో రూ.లక్షకు చేరవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మార్చి మొదటి వారంలో తులం ధర రూ.64 వేలు ఉండగా.. నెల రోజుల్లోనే సుమారు రూ.10 వేలకు పైగా ఎగబాకింది. అంతర్జాతీయ పరిస్థితులకు తోడు పెళ్లిళ్ల సీజన్‌ కావడం బంగారం పెరుగుదలకు కారణమవుతున్నాయి. తాజాగా గురువారం 24 క్యారెట్ల బంగారం రూ.74 వేల ఆల్‌టైం రికార్డుకు చేరింది. ఇక 22 కారెట్ల పుత్తడి ధర రూ.68,265కి పెరిగింది. మరోవైపు వెండి ధరలు సైతం పుత్తడి దారిలోనే పయనిస్తున్నాయి. గత నెల తొలివారంలో కిలో రూ.7,500 ఉండగా ప్రస్తుతం రూ.8500కి చేరింది.