అక్షరటుడే, వెబ్‌డెస్క్: Ration | రేషన్(Ration) లబ్ధిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రేషన్ కార్డులపై త్వరలో సన్న బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఉగాది(Ugadi) రోజున ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించనుంది. సూర్యాపేట(Suryapeta) జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy), మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి(Uttam Kumar Reddy) సన్నబియ్యం పంపిణీని ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు.
Ration | బోనస్‌తో పెరిగిన సన్నాల సాగు
అధికారంలోకి వచ్చాక రేషన్ దుకాణాల్లో(Ration Shops) సన్న బియ్యం పంపిణీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ప్రస్తుతం ఆ దిశగా చర్యలు చేపట్టింది. గతంలో రాష్ట్రంలో సన్నాల సాగు తక్కువగా ఉండేది. పండిన సన్నరకం ధాన్యాన్ని కూడా వ్యాపారులే కొనుగోలు చేసేవారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సన్నాలకు బోనస్(Bonus) ప్రకటించింది. సన్నరకం ధాన్యంపై క్వింటాల్‌కు రూ.500 అదనంగా ఇస్తుంది. దీంతో రైతులు(Farmers) సన్నాలను ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేశారు. వ్యాపారులకు అమ్ముకుంటే బోనస్ రాదని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించారు. దీంతో వానాకాలంలో కొనుగోలు చేసిన సన్న రకం ధాన్యాన్ని మిల్లింగ్ చేసి రేషన్ లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Ration | 24 లక్షల మెట్రిక్ టన్నులు అవసరం
రాష్ట్రంలో రేషన్ కార్డులపై సన్న బియ్యం పంపిణీ చేసేందుకు ఏడాదికి 24 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం. ఏడాదిలో రెండు సీజన్లలో సేకరించే సన్నధాన్యాన్ని బియ్యంగా మార్చి ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు పంపిణీ చేసేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది.
Ration | పెరగనున్న లబ్ధిదారులు
ప్రస్తుతం రాష్ట్రంలో 91,19,268 రేషన్‌కార్డులు ఉండగా, వీటిల్లో 2,82,77,859 మంది లబ్ధిదారులు ఉన్నారు. అయితే ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇస్తామనడంతో పాటు, మార్పులు చేర్పులకు అవకాశం కల్పించింది. రాష్ట్రంలో పదేళ్ల నుంచి రేషన్‌కార్డుల కొత్తగా ఇవ్వలేదు. దీంతో కార్డులు, లబ్ధిదారుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఒక్కో లబ్ధిదారుడికి ఆరు కిలోల బియ్యం అందజేస్తున్నారు.