అక్షరటుడే, ఇందూరు: జిల్లా కేంద్రంలో 8 ట్రాక్‌లతో స్టేడియంతో పాటు ఇండోర్ స్టేడియానికి అతి త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేస్తామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తెలిపారు. గురువారం జిల్లా ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. పాత కలెక్టరేట్ ప్రాంగణాన్ని గత ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు విక్రయించడానికి చూసిందని, క్రీడా సంఘాలు, ఒలింపిక్ సంఘం పోరాట ఫలితంగా నిలిపి వేసిందన్నారు. అదే స్థలంలో అన్ని హంగులతో నూతన స్టేడియం నిర్మాణం చేసుకుందామన్నారు. దేశంలో క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వరనే అపవాదు ఉందని, దీన్ని తిరగరాసేలా రేవంత్ రెడ్డి క్రీడలకు ప్రోత్సాహం అందిస్తున్నారని చెప్పారు. సమావేశంలో జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య, యువజన క్రీడల శాఖ అధికారి ముత్తెన్న, ఆయా క్రీడా సంఘాల ప్రతినిధులు, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కేశ వేణు, గడుగు గంగాధర్, నరాల రత్నాకర్, ఖైసర్ తదితరులు పాల్గొన్నారు.