అక్షరటుడే, కామారెడ్డి : తెలంగాణలో ఈ నెల 6 నుంచి చేపట్టబోయే కులగణన చరిత్ర సృష్టించబోతుందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో శనివారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కులగణన అవగాహన కార్యక్రమంలో షబ్బీర్ అలీ మాట్లాడారు. ఏళ్లుగా బీసీలు తమ సమస్యలను విన్నవించినా ఏ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. తెలంగాణను మోడల్ గా తీసుకుని జనవరి నుంచి కేంద్రం సెన్సెస్ ను చేపట్టాలన్నారు. కేసీఆర్ హయాంలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలు ఎక్కడ ఉన్నాయో తెలియదన్నారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కులగణన ఆధారంగానే జరుగుతాయని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపిందని గుర్తు చేశారు. ఈ నెల 6 నుంచి చేపట్టే కులగణన సర్వేను రాహుల్ గాంధీ ప్రారంభిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజు, డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ మున్సిపల్ ఛైర్మన్లు, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.