అక్షరటుడే, వెబ్ డెస్క్: నిజామాబాద్‌ నగరంలోని నిజాం కాలనీలో ఏర్పాటు చేసిన అక్రమ వెంచర్ విషయమై అధికారులు ఎట్టకేలకు స్పందించారు. సంబంధిత యజమానులకు నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లోపు వివరణ ఇవ్వాలని, లేనిపక్షంలో చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అందులో పేర్కొన్నారు. వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని నిజాం కాలనీలో మొగల్‌ మేడోజ్ పేరిట దాదాపు నాలుగు ఎకరాల స్థలంలో రియల్టర్లు వెంచర్‌ డెవలప్‌ చేశారు. ఇందుకు సంబంధించి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. కేవలం నాలా అనుమతి తీసుకొని ప్లాట్లుగా విభజించి అమ్మకాలు మొదలు పెట్టారు. అయితే అక్కడ వెంచర్‌ పనులు జరిగినా.. దర్జాగా రోడ్లు వేసినా మున్సిపల్‌ కార్పొరేషన్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు, రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదు. ఈ విషయమై గత నెల 25న ‘అక్షరటుడే’లో కథనం ప్రచురితం కాగా.. తాజాగా అధికారులు స్పందించారు. అక్రమ వెంచర్ అని ప్రాథమికంగా గుర్తించారు. చర్యల నిమిత్తం సంబంధిత యజమానికి నోటీసులిచ్చారు. అలాగే తదుపరిగా సంబంధిత ప్లాట్ల క్రయ విక్రయాలు జరగకుండా రిజిస్ట్రేషన్ల శాఖకు మెమో జారీ చేయనున్నారు.