గణితం.. ‘ప్రయోగం’తో సులభం..

0

అక్షరటుడే, ఇందూరు: గణితం అంటే భయపడే విద్యార్థులు ఎంతో మంది ఉంటారు. కానీ విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా ఏదైనా చేయాలని ఆ పాఠశాల ఉపాధ్యాయులు ఆలోచించారు. ప్రయోగ పూర్వకంగా వివరిస్తే ఇట్టే అర్థమవుతుందని భావించి వినూత్న ఆలోచనలకు శ్రీకారం చుట్టారు. పాఠశాలలో తమ ఆలోచనతో గణిత ప్రయోగశాలను ఏర్పాటు చేశారు. కష్టమైన గణితాన్ని ప్రయోగ పద్ధతిలో విద్యార్థులు తమ ఇష్టమైన సబ్జెక్టుగా మార్చుకునేలా చేసి చూపించారు ఎడపల్లి మండలం ఏఆర్పీ క్యాంపు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు.

చదవడం, సాధన చేయడం కంటే ప్రయోగ పద్ధతిలో ముందుకెళ్తే మరింత సులభతరమవుతుందని ప్రయోగశాలను ఏర్పాటు చేశారు. ప్రధానంగా ప్రైవేటు విద్యార్థులకు అనేక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. కానీ ప్రభుత్వ విద్యార్థులకు అందని ద్రాక్షలా ఉంటాయి. ప్రభుత్వ విద్యార్థుల్లోనూ ప్రతిభను వెలికి తీయడానికే గణిత ల్యాబ్‌ను ఏర్పాటు చేసినట్లు పాఠశాల ఉపాధ్యాయులు చెబుతున్నారు. జిల్లాలోనే ఇది మొదటి ప్రయోగశాల కావడం విశేషం.

సందర్శనకు అవకాశం

పాఠశాలలో ఏర్పాటు చేసిన గణిత ప్రయోగశాలకు అమెరికాలో స్థిరపడిన పూర్వ విద్యార్థి కృష్ణారెడ్డి ఆర్థిక సహకారం అందజేశారు. ప్రయోగశాలను జిల్లాలోని ఇతర పాఠశాలల విద్యార్థులు సందర్శించేందుకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. విద్యార్థుల్లో గణితం అంటే భయం పోగొట్టేందుకు ఈ సందర్శన ఉపయోగపడుతుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఇప్పటికే మండలంలోని ఇతర గ్రామాల పాఠశాల విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు.

ప్రయోజనాలివే..

  • ప్రయోగాల ద్వారా విద్యార్థులు తరగతి గదిలో పొందిన సైద్ధాంతిక జ్ఞానాన్ని బలోపేతం చేస్తుంది.
  • గణిత సూత్రాలను సులువుగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.
  • విజువల్స్‌, మోడల్స్‌, చార్ట్‌ల ద్వారా వినియోగాన్ని సులభతరం చేస్తుంది. దృశ్య అభ్యాసకులకు సహాయం చేస్తుంది.
  • హ్యాండ్‌ ఆన్‌ ఆక్టివిటీస్‌ గణితాన్ని ఆకర్షణీయంగా మార్చగలవు. సబ్జెక్టుపై మరింత ఆసక్తి పెరిగే అవకాశం ఉంటుంది.

అందుబాటులో ఉండేవి..

ప్రయోగశాలలో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు అవసరమయ్యే పలు మోడల్స్‌ అందుబాటులో ఉన్నాయి. ప్రధానంగా రేఖా గణితం, బీజగణితం, క్షేత్రమితి, త్రికోణమితి, సంఖ్యా గణితానికి సంబంధించిన 125 రకాల బోధనోపకరణాలను అందుబాటులో ఉంచారు. అలాగే విద్యార్థులకు ఉపయోగపడే స్థూపం, శంఖువు, కోణం తదితర గణిత సామాగ్రిని ప్రయోగశాలలో వినియోగిస్తున్నారు.

అందరి సహకారంతో ఏర్పాటు

– సాయిలు, గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు

ఎన్‌సీఈఆర్‌టీ మైసూరుకు గణిత ప్రయోగశాల శిక్షణ కోసం 2017లో వెళ్లాను. అప్పటి నుంచి గణిత ప్రయోగశాల ఏర్పాటు చేయాలనేది నా లక్ష్యం. మా పాఠశాల పూర్వ విద్యార్థి సహకారంతో పాటు హెచ్‌ఎం రమేశ్‌ ప్రోత్సాహంతో గతేడాది ల్యాబ్‌ను ఏర్పాటు చేశాం.