అక్షరటుడే, వెబ్డెస్క్ : HCU | కంచ గచ్చిబౌలి(Kancha Gachibowli) భూముల వ్యవహారం చినికి చినికి గాలివానలా మారడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. 400 ఎకరాల భూమిని వేలం వేయడానికి చదును చేస్తుండగా హెచ్సీయూ విద్యార్థులు(HCU Students) ఆ భూములు యూనివర్సిటీవే అంటూ ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలువురిపై కేసులు కూడా నమోదయ్యాయి. అయితే విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) ఇదివరకే ఆదేశించారు. తాజాగా యూనివర్సిటీ నుంచి పోలీసుల బలగాలను ఉపసంహరించనున్నట్లు ఆయన ప్రకటించారు.
హెచ్సీయూ భూముల వ్యవహారంతో విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు యూనివర్సిటీని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. విద్యార్థులు కాకుండా బయట వ్యక్తులు లోనికి వెళ్లకుండా చర్యలు చేపట్టారు. అయితే సోషల్ మీడియా(Social Media) ప్రచారం, విద్యార్థుల ఆందోళనలు, ప్రతిపక్షాల విమర్శలతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది.
ఇప్పటికే భూముల గురించి తెలుసుకోవడానికి సబ్ కమిటీ(Sub committee) వేసిన విషయం తెలిసిందే. తాజాగా యూనివర్సిటీ నుంచి పోలీసులను వెనక్కి రప్పిస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి హెచ్సీయూ వీసీ(HCU VC)కి లేఖ రాశారు. స్వీయ భద్రతా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. క్యాంపస్‌లో శాంతిభద్రతల బాధ్యత వర్సిటీదేనని ఆయన స్పష్టం చేశారు. పౌర సంఘాలు, అధ్యాపకుల వినతి మేరకు ఈ చర్యలు చేపట్టారు.