అక్షరటుడే, వెబ్‌డెస్క్: GT vs PBKS : ఐపీఎల్-2025లో అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడగా.. గుజరాత్ జట్టును మట్టి కరిపించి, 11 పరుగుల తేడాతో పంజాబ్ జట్టు విజయం సాధించింది. మొదట టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ గుజరాత్ తరఫున అరంగేట్రం చేశాడు.
టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన పంజాబ్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. గుజరాత్ టైటాన్స్ ను ఎదుట భారీ టార్గెట్ ఉంచింది. పంజాబ్ కింగ్స్ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ సెంచరీకి 3 పరుగుల దూరంలో ఆగిపోయాడు. 9 సిక్సులు, 5 ఫోర్లతో ఏకంగా 230కి పైగా స్ట్రైక్ రేట్‌తో గుజరాత్ బౌలర్లను ఒక ఆట ఆడుకున్నాడు. శశాంక్ సింగ్ 16 బంతుల్లో 44 పరుగులు చేశాడు. ఇందులో 6 ఫోర్లు, 2 సిక్సులు ఉండటం విశేషం.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జట్టు.. వికెట్లు కాపాడుకున్నా.. లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. జట్టు గెలుపునకు చమటోడ్చిన సుదర్శన్(74 పరుగులు) శ్రమ వృథా అయింది. జోష్ బట్లర్ 54 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. రూథర్ ఫర్డ్ జట్టు గెలుపు కోసం చివరి వరకు పోరాడి(46 పరుగులు) ఔట్ అయ్యాడు. అర్షదీప్ వేసిన 19.4 బాల్‌ను వికెట్ల మీదికి ఆడి, రాహుల్ తెవాతియా(6) రనౌట్‌కు కారణమయ్యాడు.