అక్షరటుడే, వెబ్‌డెస్క్: Nature School : మామూలుగా ఏ స్కూల్‌లో అయినా చదువే నేర్పిస్తారు. చదువుతో పాటు ఆటల గురించి కూడా అవగాహన కల్పిస్తారు. ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా చేయిస్తారు కానీ.. అడవులు, పొలాల్లోకి తీసుకెళ్లరు. వ్యవసాయం ఎలా చేస్తారు? అసలు మనం తినే ఆహారం ఎలా పండుతుంది.. అనేది ప్రాక్టికల్‌గా చూపించరు.. కానీ ఈ బడి మాత్రం పూర్తిగా డిఫరెంట్. అదే గురుగ్రామ్ లో ఉన్న ప్రకృతి పాఠశాల.
ఈ స్కూల్ పేరు ఫారెస్ట్ స్పిరిట్ లెర్నింగ్. జ్యోతి రాఘవన్ అనే మహిళ ఈ స్కూల్‌ను స్థాపించారు. పిల్లలకు వ్యవసాయం నేర్పించడంతో పాటు పర్యావరణం గురించి అవగాహన వచ్చేలా ఆ స్కూల్‌నే ప్రకృతికి నిలయంగా మార్చారు. సేంద్రీయ వ్యవసాయం ఎలా చేయాలి? కంపోస్టింగ్ ఎలా చేయాలి? లాంటి వాటిపై ఈ స్కూల్‌లో పిల్లలకు నేర్పిస్తున్నారు.
Nature School : పిల్లలకు అడవులు, ప్రకృతికి గురించి తెలియడం కోసమే..
పిల్లలకు ప్రకృతి, అడవుల గురించి తెలియడం కోసమే ఈ స్కూల్‌ను ఏర్పాటు చేసినట్లు జ్యోతి రాఘవన్ తెలిపారు. ఇక్కడ కొందరు పిల్లలు ప్రతిరోజూ ప్రకృతిని ఆస్వాదిస్తూ వ్యవసాయంలో నిమగ్నమవుతారు. ఢిల్లీ, గురుగ్రామ్ తదితర సిటీల్లో ఉన్న స్కూళ్ల నుంచి కూడా విద్యార్థులు ఇక్కడికి వచ్చి ప్రకృతితో మమేకమై వ్యవసాయం, కంపోస్టింగ్ గురించి నేర్చుకుంటూ ఉంటారు. ఇలా కొన్ని వేలమంది విద్యార్థులు ఇప్పటి వరకు ఈ క్యాంపస్‌ను విజిట్ చేశారు.