అక్షరటుడే, వెబ్‌డెస్క్ Polyglot : పిట్టకొంచెం కూతఘనం అనే సామెత మనందరికి తెలిసిందే. ఇటీవలి కాలంలో చిన్న పిల్లలలో ఉన్న టాలెంట్ చూసి అందరు అవాక్కవుతున్నారు. పెద్దవాళ్లకి లేని తెలివితేటలు చిన్న పిల్లలలో కనిపిస్తున్నాయి. తాజాగా తమిళనాడుకు (Tamilnadu) చెందిన 19 ఏళ్ల మహ్మద్ అక్రమ్ 46 భాషలు మాట్లాడడమే కాదు ఏకంగా 400 భాషల్లో రాయడం, టైప్ చేయడం కూడా చేస్తాడు. చెన్నైలో పుట్టి పెరిగిన ఈ యువకుడికి తన తండ్రి షిల్బీ మొజిప్ప్రియన్ ఆదర్శం అని అంటున్నాడు. అతను 16 భాషల్లో నైపుణ్యం ఉన్న లింగ్విస్ట్ కావడంతో కొడుకుకి కూడా ఈ టాలెంట్ అబ్బింది.
Polyglot : టాలెంట్ అదుర్స్…
మహ్మద్ అక్రమ్‌కి (Mohammad Akram) చిన్నప్పటి నుండి తమిళం, ఇంగ్లీష్ అక్షరాలు నేర్పించారు ఆయన తల్లిదండ్రులు. నాలుగేళ్ల వయసులోనే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్‌ను ఆరు రోజుల్లో నేర్చుకొని అందరిని ఆశ్చర్యపరిచాడు. ఆరేళ్లకు వట్టెలుట్టు, గ్రంథ, తమిళి లాంటి పురాతన తమిళ స్క్రిప్ట్స్‌పై పట్టు సాధించి తండ్రికి తగ్గ తనుయడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇక అక్రమ్ ఎనిమిదేళ్లకే మొదటి వరల్డ్ రికార్డ్ సాధించాడు. వివిధ భాషల్లో టైప్ చేస్తూ ‘యంగెస్ట్ బైలింగ్యువల్ టైపిస్ట్’ టైటిల్ కొట్టాడు. పదేళ్లకు భారత జాతీయ గీతాన్ని 20 భాషల్లో ఒక గంటలో టైప్ చేసి సత్తా చాటాడు. ఈ క్రమంలో అతను జర్మనీలో ‘యంగ్ టాలెంట్ అవార్డ్’ అందుకున్నాడు. అక్కడ ఓ టాలెంట్ షోలో గెలిచి ఆస్ట్రియాలోని డాన్యూబ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో స్కాలర్‌షిప్ కూడా అందుకున్నాడు.
12 ఏళ్లకే 400 భాషల్లో నైపుణ్యం ప్రదర్శించి జర్మన్ లింగ్విస్ట్‌లను ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం చెన్నైలోని అలగప్ప యూనివర్సిటీ నుంచి యానిమేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీ చేస్తున్నాడు. అదే సమయంలో యూకేలోని ఓపెన్ యూనివర్సిటీ నుంచి ఇంగ్లీష్ లిటరేచర్, లింగ్విస్టిక్స్‌లో మరో డిగ్రీ చేస్తున్నాడు. వియన్నాలో డాన్యూబ్ స్కూల్‌లో 39 దేశాల విద్యార్థులతో కలిసి చదువుకున్న అనుభవం ఇప్పుడు అతని టాలెంట్‌కి ఎంతగానో పనికొచ్చింది. అక్రమ్ ప్రపంచవ్యాప్తంగా భాషలు నేర్పుతున్నాడు. మయన్మార్, కంబోడియా, థాయ్‌లాండ్, ఇండోనేషియా లాంటి దేశాల్లో వర్క్‌షాప్‌లు నిర్వహించి అదరహో అనిపించాడు. 14 ఏళ్లకే యూట్యూబ్‌లో Youtube టీచింగ్ స్టార్ట్ చేశాడు. గ్లోబల్ లాంగ్వేజ్ ఇన్‌స్టిట్యూట్ ద్వారా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ క్లాసులు నడుపుతున్నాడు.