అక్షరటుడే, జుక్కల్‌: నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి వారం రోజులుగా భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోగా అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. అయితే ప్రాజెక్టు గేట్లు ఎత్తేక్రమంలో ఏడో నంబర్‌ గేటు మొరాయించింది. మధ్య వరకు లేచి మొరాయించడంతో ప్రాజెక్టు అధికారులు దాన్ని అలాగే వదిలేశారు. ఇటీవల మొదట ఆరో నంబరు వరద గేటు ఎత్తి 2వేల క్యూసెక్కుల నీటిని దిగువన మంజీరలోకి విడుదల చేశారు. శుక్రవారం ఉదయం ప్రాజెక్టుకు భారీగా ఇన్‌ఫ్లో పెరగడంతో ఏడు, పది గేట్లను సైతం ఎత్తి నీటి విడుదల కొనసాగించారు. అయితే, ఏడో గేటు ఎత్తే సమయంలో మొరాయించింది. మూడున్నర ఫీట్ల ఎత్తు వరకు లేచి నిలిచిపోయింది. అంతకుమించి పైకి రాకపోవడంతో అధికారులు అలాగే వదిలేసి, 3, 6, 8,10 వరద గేట్లను పది ఫీట్లు పైకి లేపి నీటిని విడుదల చేస్తున్నారు. సాయంత్రానికి ఇన్‌ఫ్లో మరింత పెరగడంతో 9వ గేటు సైతం ఎత్తి నీటి విడుదల కొనసాగిస్తున్నారు. మొత్తంగా ఐదుగేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది.

గతేడాదీ మొరాయించిన గేటు..

ఇదిలా ఉండగా నిజాంసాగర్‌ ప్రాజెక్టు ఏడో నంబరు గేటు గతేడాది కూడా మొరాయించింది. ప్రాజెక్టు అధికారులు శ్రమించి ఎట్టకేలకు గేటు మూసివేశారు. గేట్లకు ఆయిల్‌ గ్రీజింగ్‌ చేయకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొంటోందని ప్రాజెక్టు సిబ్బంది చెబుతున్నారు. ఈసారి కూడా అదే గేటు కొద్దిమేర పైకి లేచి మొరాయిస్తోంది. ప్రస్తుతానికి ప్రాజెక్టుకు భారీ వరద వస్తుండడంతో నీటిని విడుదల చేస్తున్నారు. పైనుంచి ఇన్‌ఫ్లో తగ్గితే గేట్లను మూసివేస్తారు. అయితే ఈ గేటు మళ్లీ మూసుకుంటుందో.. లేదోనని ప్రాజెక్టు సిబ్బంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ గేటు అలాగే మొరాయిస్తే ప్రాజెక్టులోని నీరు వృథాగా పోయే అవకాశం లేకపోలేదు. దీంతో ప్రాజెక్టు అధికారుల్లో ఏడో గేటుపై టెన్షన్‌ నెలకొంది.