అక్షరటుడే, ఆర్మూర్: పట్టణ మున్సిపల్ ఛైర్ పర్సన్ అవిశ్వాస ప్రక్రియ రోజుకో మలుపు తిరుగుతోంది. ఇటీవల అవిశ్వాసం వీగినట్లు మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఉత్తర్వులు జారీ చేయగా.. ఛైర్ పర్సన్ పండిత్ వినీత తిరిగి బాధ్యతలు చేపట్టారు. ఇంతలోనే.. హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం మెమో జారీ చేసిందని మరో వర్గం కోర్టును ఆశ్రయించింది. అవిశ్వాసం నెగ్గినప్పటికీ.. నిబంధనలకు విరుద్ధంగా మున్సిపల్ అధికారులు ఉత్తర్వులు ఇచ్చారని కోర్టుకు నివేదించారు. విచారణ జరిపిన న్యాయస్థానం వారికి నోటీసులు జారీ చేసింది. కాగా సదరు మెమోను వెనక్కు తీసుకుంటు న్నట్లు ప్రభుత్వం తరపున మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ కోర్టుకు స్పష్టం చేశారు. దీంతో అవిశ్వాసం నెగ్గినట్లు కాగా.. వెంటనే నూతన ఛైర్ పర్సన్ ఎన్నిక ప్రక్రియ పూర్తి చేయాలని ఎన్నికల కమిషన్ అధికారులను హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఉత్తర్వులు అందిన తర్వాత జిల్లా కలెక్టర్ నూతన ఛైర్ పర్సన్ ఎన్నిక కోసం చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. అయితే తాజా ఉత్తర్వులపై ప్రస్తుత ఛైర్ పర్సన్ పండిత్ వినీత తిరిగి కోర్టును ఆశ్రయించినట్లు తెలిసింది.