అక్షరటుడే, వెబ్డెస్క్: కొత్తగా నిర్మించిన పంబన్ వంతెనపై తాజాగా నిర్వహించిన హైస్పీడ్ ట్రైన్ ట్రయల్ రన్ విజయమంతమైంది. రెండు కిలోమీటర్ల పొడవైన ఈ వారధి పైనుంచి వేగంగా దూసుకెళ్లింది. తమిళనాడులోని రామనాథపురం జిల్లా మండపం పట్టణం నుంచి రామేశ్వరంలోని పంబన్ ద్వీపాన్ని ఈ వంతెన కలుపుతుంది. సముద్రంపై నిర్మించిన ఈ వారధి మధ్యలో ఉన్న హైడ్రాలిక్ భాగం పైకి లేచి భారీ ఓడలకు దారి ఇస్తుంది. రూ. 535 కోట్లతో దీనిని నిర్మించారు. ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో ఈ వంతెనను ప్రారంభించనున్నారు. ఇప్పటికే రెండు లోడు డిఫ్లెక్షన్లు నిర్వహించగా.. తాజాగా హై స్పీడ్ టెస్ట్ కొనసాగింది.
పాత వారధికి బీటలు
110 ఏళ్ల నిర్మించిన బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకోవడంతో దాని పక్కనే ఈ కొత్త వారధిని నిర్మించారు. 1914లో రామేశ్వరం దీవిని భారత భూభాగంతో కలుపుతూ పాత రైల్వే వంతెన నిర్మించారు. దాని దిగువన పడవలు ఓడలు వెళ్లే విధంగా మధ్యలో హైడ్రాలిక్ లిఫ్ట్ ఏర్పాటు చేశారు. 1964 లో వచ్చిన భారీ తుపాను వల్ల వంతెన కొంత భాగం దెబ్బతింది. 1988లో దీనికి చేరువగా పొడవైన రహదారి వంతెన నిర్మించే సమయంలో పాత వంతెనకు బీటలు వారాయి. అప్పుడే కొత్త వారధి నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారు. 2019 మార్చిలో పనులు ప్రారంభించారు. ఆ తర్వాత కొవిడ్ మహమ్మారి ప్రభావం, తరచూ అలల ఉద్ధృతి వల్ల పనులు ఆలస్యమయ్యాయి. నిర్మాణ వ్యయం కూడా పెరిగింది.
ఏడాదిగా రాకపోకల నిలిపివేత
పాత వంతెన మధ్యలో ఉన్న హైడ్రాలిక్ లిఫ్ట్ పైకి ఎత్తడంలో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ తరుణంలో 2023 డిసెంబరు నుంచి ఈ ప్రాంతంలో భారీ ఓడల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. కొత్త వారధి అందుబాటులోకి వస్తే.. పడవల రాకపోకలు తిరిగి ప్రారంభమవుతాయి.