ప్రభుత్వ స్థలాలు, చెరువులు, శిఖం భూములు ఆక్రమించి మల్లారెడ్డి కాలేజీలు నిర్మించారని గతంలో రేవంత్‌ రెడ్డి మల్లారెడ్డి పై తీవ్ర ఆరోపణలు చేశారు.

అప్పుడు మంత్రి హోదాలో ఉన్న మల్లారెడ్డి రేవంత్‌ రెడ్డిపై తీవ్రమైన పదజాలంతో దూషించారు. ఒక దశలో వేదికపైనే తొడగొట్టి సవాల్‌ విసిరారు.

ఈ దశలో ఇరువురు ఉప్పు, నిప్పుగా మారారు. ఇది గతం.. ప్రస్తుతం మాజీ మంత్రి మల్లారెడ్డి రంగులు మార్చారు. బుధవారం సీఎం రేవంత్‌ రెడ్డి ఇంట్లో ప్రత్యక్షమయ్యారు. విషయం ఏమిటని మీడియా అడిగితే.. మనమరాలి పెళ్లి పత్రిక ఇచ్చేందుకు వచ్చానని దాటవేశారు. ఏదేమైనా రేవంత్‌ రెడ్డి ఇంటికి మల్లారెడ్డి వెళ్లడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: సీఎం రేవంత్‌ రెడ్డి, మాజీ మంత్రి మల్లారెడ్డి గతంలో టీడీపీలో కలిసి పనిచేశారు. ముందుగా మల్లారెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరగా.. రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలోకి వచ్చారు. ఆ సమయంలో భూ ఆక్రమణల గురించి ఇద్దరి మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ఆ తర్వాత పరిస్థితులు మారాయి. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చింది. రేవంత్‌ రెడ్డి సీఎం పదవి చేపట్టడంతో.. మల్లారెడ్డి వెనక్కి తగ్గాల్సి వచ్చింది. దీనికి తోడు ఇటీవల హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలు, ప్రభుత్వ స్థలాలు, చెరువులను ఆక్రమించి నిర్మించిన కట్టడాలపై హైడ్రా తీవ్రస్థాయిలో చర్యలు తీసుకోవడంతో మల్లారెడ్డి పరిస్థితి మింగలేక కక్కలేక అన్నచందంగా మారింది.

హైడ్రా భయంతో..

మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌ రెడ్డికి సంబంధించి దుండిగల్‌లో ఉన్న ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ కాలేజ్‌ పూర్తిగా చెరువుకు సంబంధించిన బఫర్‌ జోన్‌ స్థలంలో నిర్మించారని హైడ్రా గుర్తించింది. ఈ కాలేజీ భవనాల సముదాయంతో పాటు పక్కనే ఉన్న ఎంఎల్‌ఆర్‌ఐటీ కాలేజీలో ఉన్న క్యాంటీన్‌ను కూల్చివేస్తామని నోటీసులు పంపించినట్లు సమాచారం. కాగా ఇప్పటివరకు కూల్చివేతలు చేపట్టలేదు. సామాన్యుల ఇళ్లు, వ్యాపార స్థలాలపై వెంటనే చర్యలు తీసుకున్న హైడ్రా.. ఇప్పటివరకు ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ భవనాలను కూల్చివేయకపోవడంపై ఇప్పటికే విమర్శలు వెలువడుతున్నాయి. హైడ్రా అధికారులు అటువైపు రాకుండా మల్లారెడ్డి పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు పార్టీ మారడం ఒక్కటే శరణ్యమని భావించిన మల్లారెడ్డి.. ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును కలిశారు. ఆయన ద్వారా మల్లారెడ్డి సీఎం రేవంత్‌రెడ్డికి దగ్గర కావాలని భావించినట్లు తెలుస్తోంది. ఈ మేరకే తాజాగా ఇద్దరి కలయికగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక మల్లారెడ్డి కాంగ్రెస్‌ కండువా వేసుకోవడం ఒక్కటే మిగిలిందని పేర్కొంటున్నారు.