అక్షరటుడే, బాన్సువాడ: బాన్సువాడ మండలం కొత్తబాది గ్రామ ప్రధాన రహదారికి ఆనుకొని ఎకరం స్థలంలో ఇటీవల అక్రమ వెంచర్ ఏర్పాటు చేశారు. పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే ప్లాట్లు చేసి విక్రయిస్తున్నారు. నస్రుల్లాబాద్ మండల కేంద్రం శివారులోనూ రెండెకరాల్లో వెంచర్ ఏర్పాటు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండానే ప్లాట్లుగా మార్చేసి అమ్మకాలు జరుపుతున్నారు. ఇలా అనేక చోట్ల నాన్‌లేఅవుట్ ప్లాట్లు వెలిసినా అధికారులు చోద్యం చూస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి పడుతోంది. వ్యవసాయ భూముల్లో ప్లాట్లు ఏర్పాటు చేయడం, నిర్మాణాలు చేపట్టడం పూర్తిగా నిషేధం. అయితే కళ్లెదుటే అన్ని పనులు జరుగుతున్నా జీపీ అధికారులు పట్టించుకోవడం లేదు. పలుచోట్ల వారే దగ్గరుండి మరి అండదండలు అందిస్తున్నారు. ఒకవేళ లేఅవుట్ అనుమతులు తీసుకోవాలంటే.. నాలా మొదలు డీటీసీపీ రుసుములు చెల్లించాల్సి ఉంటుంది. స్థానిక మున్సిపల్ లేదా గ్రామ పంచాయతీకి పది శాతం స్థలం వదలడం తప్పనిసరి. వీటితో పాటు అన్నిరకాల వసతులు సమకూర్చాలి. వీటన్నింటి నుంచి తప్పించుకునేందుకు రియల్టర్లు దొడ్డిదారిలో అక్రమ వెంచర్లు ఏర్పాటు చేసి క్రయవిక్రయాలు జరుపుతున్నారు.
ఎలాంటి అనుమతులు లేవు..
-గణేశ్, పంచాయతీ కార్యదర్శి, కొత్తబాది
వెంచర్ ఏర్పాటు చేసుకోవడానికి గ్రామ పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. స్థలంలో మొరం వేసి చదును చేస్తున్నట్లు మా దృష్టికి కూడా వచ్చింది. త్వరలోనే పరిశీలించి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం.