Advertisement

అక్షరటుడే, నిజామాబాద్: బీమా సొమ్ము కాజేతకు అక్రమార్కులు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. అడ్డదారిలో సొమ్ము చేసుకుంటూ అమాయకులను బలి చేస్తున్నారు. తాజాగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రాంతంలో కింగ్ కోఠి బైక్స్ బీమా స్కాం ఘటన వెలుగు చూసింది. వీరు బీమా సొమ్మును కాజేసే విధానం చూసి పోలీసులే విస్తుపోయారు. ఆర్మూర్ ప్రాంతంలో పెద్ద మొత్తంలో 32 దొంగ బైకులను పోలీసులు సీజ్ చేయడం సంచలనంగా మారింది.

బోగస్ ఏజెన్సీలు..

కొందరు వ్యక్తులు వివిధ సంస్థలకు చెందిన బైకులను విక్రయించే ఏజెన్సీలను కింగ్ కోఠీలో ఏర్పాటు చేసి, సదరు కంపెనీల నుంచి కొత్త బైకులను కొంటారు. అనంతరం వాటిని నిబంధనల ప్రకారం వినియోగదారులకు విక్రయించకుండా ఆ వాహనాలు దొంగతనానికి గురయ్యాయని వివిధ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తారు. ఈమేరకు పోలీసులు కేసులు నమోదు చేస్తారు. వీటి ఎఫ్ఐఆర్ ఆధారంగా వాహనాలకు బీమా సొమ్ము క్లెయిమ్ చేస్తారు. అనంతరం ఆ వాహనాలను ఎలాంటి రిజిస్ట్రేషన్ పత్రాలు లేకుండా గ్రామీణ ప్రాంతాలకు చెందిన అమాయకులకు విక్రయిస్తూ మరోమారు సొమ్ము చేసుకుంటున్నారు.

గ్రామీణ ప్రాంతాలే లక్ష్యం..

తాజాగా బయటకు వచ్చిన సమాచారం ప్రకారం.. కొన్ని ముఠాలు ఈ దందాను పక్కాగా నడిపిస్తూ ద్విచక్ర వాహనాలను సగం ధరలకే అమ్ముకోవడం, మరి కొన్ని బైకులను విడి భాగాలుగా విడదీసి అమ్ముకోవడం చేస్తున్నారు. ఈ వాహనాలను ఇతర రాష్ట్రాలు, ఇతర జిల్లాల్లోని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ధరకు విక్రయించడమే పనిగా పెట్టుకున్నారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Dsp transfer | ఎల్లారెడ్డి డీఎస్పీ బదిలీ

పెద్దఎత్తున దొంగ వాహనాలు

ఆర్మూర్ నియోజకవర్గంలోనే పెద్ద ఎత్తున దొంగ వాహనాలు వెలుగు చూడగా.. పోలీసులు సీజ్ చేశారు. అంకాపూర్ లో 5, మిర్దాపల్లిలో 10, డొంకేశ్వర్ లో 2, మైలారంలో 15 దొంగ బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ప్రజాప్రతినిధి అనుచరుడి హస్తం!

అమాయకులను నిలువునా ముంచుతున్న మాఫియా ఆగడాలు ఆర్మూర్ నియోజకవర్గంలో విచ్చలవిడిగా సాగుతున్నాయి. దీని వెనుక ఆర్మూర్ నియోజకవర్గానికి చెందిన ముఖ్య ప్రజాప్రతినిధి అనుచరుడి హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, సదరు ప్రజాప్రతినిధి తన అనుచరుడిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకు పెద్ద స్థాయిలోనే మంతనాలు సాగుతున్నట్లు సమాచారం. డొంకేశ్వర్ మండలానికి చెందిన సదరు చోటా నేత ఈ వ్యవహారంలో చిక్కడం నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. కాగా, దీని వెనుక ముఖ్య ప్రజాప్రతినిధి ఉన్నారని మరో మాజీ ప్రజాప్రతినిధి సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది.

Advertisement