అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: కొత్త సంవత్సరంలో పోలీసు అధికారులు నేరాల నియంత్రణకు కృషి చేయాలని ఇన్ ఛార్జి పోలీస్ కమిషనర్ సింధూశర్మ సూచించారు. నగరంలోని కమిషనరేట్ కార్యాలయంలో శుక్రవారం పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఒక ప్రణాళికను రూపొందించుకుని నేరాల నియంత్రణ కోసం సిబ్బంది పైఅధికారుల సూచనలను పాటించాలని ఆదేశించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ప్రధాన దృష్టి సారించాలని, కోర్టు కేసుల విషయంలో త్వరితగతిన స్పందించాలని సూచించారు. పెట్రోలింగ్ వ్యవస్థను పటిష్ట పర్చాలని, నిఘా వ్యవస్థను ముమ్మరం చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో నిజామాబాద్ అదనపు పోలీస్ కమీషనర్(అడ్మిన్) జి.బస్వారెడ్డి, ప్రొబేషనరీ ఐపీఎస్ సాయికిరణ్ పత్తిపాక, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ సైబర్ క్రైమ్ పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
