అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: నిజామాబాబాద్‌ నగరంలో ఓవైపు అధికారులు అక్రమ వెంచర్లపై కొరడా ఝులిపిస్తున్నారు. ఇంకోవైపు రియల్టర్లు దర్జాగా అక్రమ వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల ఎన్‌ఆర్‌ఐ కాలనీలో అనుమతుల్లేని వెంచర్‌పై నగరపాలక సంస్థ చర్యలు తీసుకుంది. కాగా.. బోధన్‌ రోడ్డు ఎన్‌ఎన్‌ ఫంక్షన్‌హాల్‌ సమీపంలో మరో అక్రమ వెంచర్‌ వెలిసింది. గతంలో ఇక్కడ ఓ రైస్‌మిల్‌ ఉండగా కొద్ది రోజులుగా అది మూతబడింది. ప్రస్తుతం రెండున్నర ఎకరాల స్థలంలో దర్జాగా రోడ్లు వేశారు. హద్దురాళ్లను సైతం ఏర్పాటు చేశారు. ప్లాటింగ్‌ చేసి అమ్మకాలు మొదలుపెట్టారు. డీటీసీపీ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. కనీసం దరఖాస్తు కూడా చేసుకోలేదు. కేవలం రైస్‌మిల్‌ పేరిట నగరపాలక సంస్థ నుంచి ఉన్న ట్యాక్స్‌ పత్రంతో వెంచర్‌ ఏర్పాటు చేయడం గమనార్హం. మరోవైపు నాన్‌లేవుట్‌ వెంచర్లు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ అధికారులు గతంలో ప్రకటించారు. కానీ, ప్రధాన రహదారి పక్కనే అక్రమ వెంచర్‌ వెలిసినా చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తీరా రియల్టర్లు అమ్మకాలు ముగించుకున్నాక సామాన్యులపై చర్యలు తీసుకోవడం కాదని, ముందుగానే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు.