అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్: నిజామాబాద్ మున్సిపల్ రెవెన్యూ విభాగం సూపరింటెండెంట్ నరేందర్ అక్రమాస్తులు అన్నీఇన్నీ కావు. ఏసీబీ దాడుల్లో నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఏకంగా రూ.6.07 కోట్ల విలువ చేసే అక్రమాస్తులను ఏసీబీ గుర్తించింది. అక్రమాస్తులు కలిగి ఉన్నాడనే సమాచారంతో నిజామాబాద్ రేంజ్ ఏసీబీ అధికారులు శుక్రవారం తెల్లవారుజామున నరేందర్ ఇంట్లో సోదాలు జరిపారు. ఇంటితో పాటు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం, కోటగల్లి, నిర్మల్‌లోని బంధువుల ఇళ్లలో ఏకకాలంలో దాడి జరిపారు. కాగా.. వినాయక్‌నర్‌లోని అశోక టవర్స్‌లో గల నరేందర్ ఇంట్లో ఏకంగా రూ.2.93 కోట్ల నగదును గుర్తించారు. అలాగే ఆయన భార్య బ్యాంకు అకౌంట్‌లో రూ.1.10 కోట్ల నగదు ఉన్నట్లు తేల్చారు. అలాగే అర కిలోకు పైగా బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా 1.98 కోట్లు విలువ చేసే 17 స్థిరాస్తులను గుర్తించినట్లు ఏసీబీ అధికారికంగా ప్రకటించింది. అనంతరం నరేందర్‌ను ఏసీబీ తమ కస్టడీలోకి తీసుకుంది. జిల్లాలో ఈ స్థాయిలో అక్రమాస్తులతో ఉద్యోగి పట్టుబడడం ఇదే మొదటిసారి.