అక్షరటుడే, వెబ్ డెస్క్: హైదరాబాద్ లోని చర్లపల్లి రైల్వే టెర్మినల్ సిద్ధమైంది. ఈ రైల్వే స్టేషన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం(నేడు) ఉదయం 10 గంటలకు వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్రమంత్రులు జి.కిషన్ రెడ్డి, బండి సంజయ్ తదితరులు హాజరుకానున్నారు.
భారీగా నిర్మాణ వ్యయం
ప్రస్తుతం ఉన్న సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి (హైదరాబాద్ డెక్కన్) స్టేషన్లు వందేళ్ల క్రితం నిర్మించినవి. మళ్లీ ఇన్నేళ్లకు అంతపెద్ద స్థాయిలో టెర్మినల్ అందుబాటులోకి వస్తోంది. చర్లపల్లి టెర్మినల్ పనులు 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.230 కోట్ల అంచనా వ్యయంతో మొదలయ్యాయి. ప్రస్తుతం నిర్మాణ వ్యయం రూ.430 కోట్లకు చేరుకుంది.
లక్ష మంది ప్రయాణికుల సామర్థ్యం
సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్లపై ఒత్తిడి తగ్గించడానికి చర్లపల్లి రైల్వేస్టేషన్ పునర్నిర్మాణం చేపట్టారు. సికింద్రాబాద్‌లో ప్రస్తుతం రోజుకు రెండు లక్షల మంది ప్రయాణికుల రాకపోకలు, 236 రైళ్లు వచ్చిపోతున్నాయని అధికారుల మాట. సికింద్రాబాద్ స్టేషన్‌కు వచ్చే 12 రైళ్లకు చర్లపల్లిలో ప్రస్తుతం హాల్ట్ కల్పిస్తున్నారు. ఇక్కడ ప్రస్తుతం 13 రైళ్లకు హాల్టింగ్ సౌకర్యం ఉంది. కొత్త ట్రాకులు, ప్లాట్‌ఫాంలు అందుబాటులోకి వస్తే అదనంగా 15 రైళ్లు నిలపొచ్చు. లక్ష మంది ప్రయాణికుల సామర్థ్యానికి తగ్గట్లుగా చర్లపల్లి టెర్మినల్‌ను తీర్చిదిద్దారు.
ఆధునిక హంగులు
చర్లపల్లి టర్మినల్ లో తొమ్మిది ట్రాకులు ఉండగా.. వాటి సంఖ్యను 19కి పెంచారు. ఐదు ప్లాట్‌ఫాంలను తొమ్మిదికి చేశారు. స్టేషన్ ఆవరణలో దాదాపు 5,500 మొక్కలతో పచ్చదనాన్ని సంతరించారు. టెర్మినల్‌లో విమానాశ్రయం తరహాలో ఆధునిక హంగులు కల్పించారు. విశాలమైన పార్కింగ్, రహదారులు, సూచిక బోర్డులు, సెంట్రల్ లైటింగ్, దివ్యాంగులకు ర్యాంపులు, బుకింగ్ కౌంటర్, ఆటోలు, ట్యాక్సీలు, బస్సులకు ప్రత్యేక బే, డిజిటల్ డిస్ ప్లే బోర్డులతో సుందరంగా తీర్చిదిద్దారు. ప్రయాణికుల సహాయ కేంద్రం, 9 లిఫ్టులు, 5 ఎస్కలేటర్లు, ప్రయాణికుల లాంజ్‌లు, బేబీ ఫీడింగ్ రూములు, పైఅంతస్తులో కెఫేటేరియా, ఫుడ్ కోర్టులకు స్థలం.. తదితరాలు రైల్వే స్టేషన్ కు ప్రత్యేక వన్నె తెస్తున్నాయి.

