దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు కుప్పకూలాయి. వరుసగా నాలుగు సెషన్లలో పెరుగుతూ వచ్చిన మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజీ సూచీ సెన్సెక్స్ ఏకంగా 738 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 50, ఇండెక్స్ 269 పాయింట్లు నష్టపోయింది. దీంతో ఇన్వెస్టర్ల సంపద ఒక్కరోజే రూ.8 లక్షల కోట్లు ఆవిరైపోయింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు గత కొద్ది రోజులుగా రాకెట్ వేగంతో దూసుకెళ్తూ.. 80 వేల పాయింట్ల మార్క్ దాటాయి. గత నాలుగు వరుస సెషన్లలో భారీ లాభాలు అందుకున్న సూచీలకు శుక్రవారం ఒకేసారి బ్రేక్ పడింది. గ్లోబల్ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడం, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపిన క్రమంలో స్టాక్ మార్కెట్ సూచీలు కుప్పకూలాయి. మార్కెట్లు ముగిసే నాటికి భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి.
వచ్చే వారం వార్షిక బడ్జెట్ ఉన్న నేపథ్యంలో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లలో ఎక్కువగా అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది. వీటి ఫలితంగానే ఈ పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బాంబే స్టాక్ ఎక్స్చేంజీలో లిస్టెడ్ కంపెనీల మొత్తం విలువ రూ.454.4 లక్షల కోట్ల నుంచి రూ.446.4 లక్షల కోట్లకు పడిపోయింది.
శుక్రవారం ఉదయం 81,585 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఆ తర్వాత కొద్ది సేపటికే నష్టాల్లోకి వెళ్లింది. తిరిగి ఒక్కసారి కూడా లాభాల్లోకి రాలేకపోయింది. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 738.81 పాయింట్లు నష్టపోయి 80,604 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ 50 ఇండెక్స్ ఇవాళ 269 పాయింట్ల నష్టంతో 24,534 వద్ద ముగిసింది. రూపాయి మారకం విలువ మరింత పడిపోయి డాలర్‌తో పోలిస్తే రూ.83.66 వద్ద ట్రేడింగ్ అవుతోంది. ఇన్ఫోసిస్, ఏషియన్ పేయింట్స్, ఐటీసీ, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు తప్ప.. దాదాపు అన్ని షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. గ్లోబల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 85 డాలర్ల వద్ద ఉంది.
–నరేష్ చందన్(naresh chandhan)