అక్షరటుడే, హైదరాబాద్: CLP meeting : తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి పదవులపై తీవ్ర చర్చ సాగుతోంది. పదవుల కోసం సీనియర్ నేతల మధ్య కుమ్ములాటలు కొనసాగుతున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో దాదాపు తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్.. కష్టం మీద అధికారంలోకి వచ్చింది. అయితే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని మంత్రి పదవులను భర్తీ చేయకుండా అలాగే ఉంచారు. ఇటీవల కాలంలో కేబినెట్ విస్తరణ జరుగుతుందని జోరుగా చర్చ సాగింది. ఇందుకోసం సీఎం రేవంత్ ఢిల్లీకి వెళ్లి అధిష్టానంతో చర్చలు కూడా జరిపారు. త్వరలో విస్తరణ ఉంటుందని పలువురు మంత్రులు కూడా వ్యాఖ్యానించారు. అయినా ఇప్పటికీ కేబినెట్ విస్తరణపై క్లారిటీ రాలేదు. కానీ.. మంత్రి పదవుల కోసం పలువురు నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పదవుల కోసం ఒకరిపై ఒకరు విమర్శలు సైతం చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం పార్టీకి తలనొప్పిగా మారింది.
దీంతో ఈ గొడవలకు ఫుల్స్టాప్ పెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి చర్యలు చేపట్టారు. నేడు ఉదయం 11 గంటలకు శంషాబాద్ నోవాటెల్ హోటల్లో రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ అత్యవసర భేటీ ఏర్పాటు చేశారు. భేటీకి మంత్రులు, విప్‌లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం మంత్రి వర్గ విస్తరణకు సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తూ వస్తున్నా.. పార్టీలోని సీనియర్ నేతల వ్యవహారంతో అడుగులు ముందుకుపడడం లేదు. ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలు చేసుకుంటూ పార్టీ ప్రతిష్ఠను దిగజార్చుతున్నారు.
మంత్రి వర్గ విస్తరణ విషయంలో తనకు మంత్రి పదవి రాకుండా జానారెడ్డి అడ్డుకున్నారని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపింది. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ విషయంలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
హెలికాప్టర్ లేకుండా నల్గొండకు చెందిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బైట అడుగుపెట్టట్లేదంటూ మంత్రి దామోదర రాజనర్సింహ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. మంత్రి పదవి రాకుంటే రాజీనామా చేస్తానని మల్ రెడ్డి రంగారెడ్డి ప్రకటించడం కూడా వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలో అందరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు సీఎల్పీ మీటింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిసింది. నేడు జరుగనున్న ఈ భేటీ సీఎం రేవంత్ రెడ్డి కీలక అంశాలు చర్చించనున్నట్లు తెలుస్తోంది. కాగా.. సీఎల్పీ భేటీ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది.