అక్షరటుడే, నిజాంసాగర్ : Nizamsagar | నిజాంసాగర్ చివరి ఆయకట్టు తడారిపోతోంది. వేసవి ప్రారంభంలోనే ఈ దుస్థితి నెలకొంది. తలాపున నీళ్లున్న తమ పొలాలకు నీళ్లందక కర్షకుల కళ్లల్లో నీళ్లు వస్తున్నాయి. కాల్వల ద్వారా సరిపడా నీరు రాకపోవడం.. ఎగువభాగంలో మోటార్లు పెట్టి నీళ్లు తోడేస్తుండడంతో.. చివరి ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు.
నిజాంసాగర్ నిండుకుండలా ఉన్నప్పటికీ చివరి ఆయకట్టుకు నీరందకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. నిజాంసాగర్ ప్రాజెక్ట్(Nizamsagar Project) ఆయకట్టు కింద ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 1.25 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోంది. పంటల కోసం ఇప్పటికే నాలుగు విడతల్లో 7.94 టీఎంసీల నీటిని విడుదల చేశారు. అయితే వేసవి కాలం ఆరంభంలోనే పలు చోట్ల పంటలు ఎండిపోతున్నాయి.
Nizamsagar | అధికారుల నిర్బంధం..
అధికారుల పర్యవేక్షణ లోపంతోనే ఇదంతా జరుగుతోందని బోధన్ మండల రైతులు ఇటీవల నీటిపారుదల శాఖ అధికారులను నిర్భందించారు. ప్రధాన కాలువ పరిధిలోని వర్ని, చందూర్, జాకోరా, రుద్రూర్, కోటగిరి, బోధన్ ప్రాంతాల్లోని పొలాలకు మొత్తానికే సాగు నీరు రావట్లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎగువన ఉన్న రైతులు ఎక్కువ నీటిని వినియోగించుకుంటున్నారని.. చివర్లో ఉన్న తమ పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నారు.
Nizamsagar | పోచారం స్పందించడంతో..
పంటలక నీరు అందడం లేదని రైతులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన పంటలకు నీరందేలా పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో నీటి పారుదల శాఖ అధికారులు రాత్రివేళ కాలువల వెంబడి తిరుగుతూ పర్యవేక్షిస్తున్నారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఎగువన ఉన్న రైతులు ఎక్కడి వారక్కడ బోరు మోటార్లు వినియోగించడం మాత్రం ఆపట్లేదు.
Nizamsagar | మరో రెండు విడతలు..
ఆయకట్టుకు మొత్తం ఆరు విడతల్లో 11 టీఎంసీల నీటిని విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే నాలుగు విడతల్లో 7.94 టీఎంసీల నీటిని వదిలారు. ఈ లెక్కన మరో రెండు విడతల్లో మూడు టీఎంసీల నీటిని విడుదల చేయాల్సి ఉంది. కానీ, మూడు టీఎంసీలతో పంటలు గట్టెక్కే పరిస్థితి లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు.
చర్యలు తీసుకుంటాం..
– శ్రీనివాస్, నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజినీర్
ఆయకట్టు కింద సాగు చేసిన పంటలకు నీరు అందిస్తున్నాం. దాదాపు 20 వేల ఎకరాలకు అక్రమంగా నీటిని తరలిస్తున్నారు. దీంతో చివరి ఆయకట్టు రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. ఆయకట్టు కింద ప్రతి ఎకరాకు నీరు అందేలా చర్యలు తీసుకుంటున్నాం.