అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: నిజామాబాద్‌ రిజిస్ట్రేషన్ల శాఖ పరిధిలో పేరుకే ‘జీరో’ బదిలీలు జరిగినట్లు తెలుస్తోంది. ప్రత్యేకించి నలుగురు అధికారులను జిల్లా నుంచి బదిలీ చేయకపోవడం ఇందుకు కారణంగా వినిపిస్తోంది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల శాఖలో పెద్దఎత్తున బదిలీలు జరిగిన విషయం తెలిసిందే. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో ఉన్న పది సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో కింది స్థాయి సిబ్బంది నుంచి అధికారుల వరకు స్థానచలనం కల్పించారు. ప్రత్యేకించి సబ్‌ రిజిస్ట్రార్లు, సీనియర్‌ అసిస్టెంట్ల బదిలీల విషయంలో ‘జీరో’ ట్రాన్స్‌ఫర్‌ నిబంధన అమలు చేశారు. ఫలితంగా ఉమ్మడి జిల్లాలో ఉన్న దాదాపు 25 మంది సబ్‌ రిజిస్ట్రార్లు, సీనియర్‌ అసిస్టెంట్లు వేర్వేరు జిల్లాలకు బదిలీపై వెళ్లారు. కానీ, నలుగురు అధికారులకు మాత్రం ఎలాంటి బదిలీలు జరగకపోవడం, ప్రస్తుతం వారంతా కీలక స్థానాల్లో కొనసాగుతుండటం ఆ శాఖలో తీవ్ర చర్చకు దారి తీసింది. నిజామాబాద్‌ డీఐజీ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా ఉన్న శ్రీధర్‌ను ఎక్కడికి బదిలీ చేయలేదు. పైగా ఆయనే బదిలీల్లో అన్నీ తానై చక్రం తిప్పారు. ప్రస్తుతం నిజామాబాద్‌ రూరల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌గా ఉన్న బాదర్‌ను ఆడిట్ రిజిస్ట్రార్‌గా తిరిగి ఇదే జిల్లాలో నియమించారు. అలాగే రవీందర్‌ను చిట్స్‌ రిజిస్ట్రార్‌గా, సబ్‌ రిజిస్ట్రార్‌ అయిన రుక్మిణిని డీఐజీ కార్యాలయం సూపరింటెండెంట్ గా కొనసాగిస్తున్నారు. వాస్తవానికి ‘జీరో’ ట్రాన్స్‌ఫర్‌ నిబంధన అంటే ఇదివరకు జిల్లాలో ఉన్న వారంతా ఇతర జిల్లాలకు తప్పనిసరి బదిలీ కావాల్సి ఉంటుంది. కానీ ఈ నలుగురిని మాత్రం ప్రత్యేకించి పాత జిల్లాల్లోనే కొనసాగించడం వివాదాస్పదమైంది. ప్రస్తుతం ఈ అంశంపై రాష్ట్ర స్థాయి అధికారుల వద్ద చర్చ జరుగుతున్నట్లు తెలిసింది.